అధికారం ఉందని… చట్టానికి, రాజ్యాంగానికి అతీతం అనుకుంటే ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతున్న వాతావరణం కనిపిస్తోంది. అంతా రివర్స్ అవుతోంది. పోలవరం నుంచి మీడియాపై నిషేధం వరకూ.. ప్రతీ అంశంలోనూ తీసుకున్న నిర్ణయాలు రివర్స్ కాక తప్పడం లేదు. ప్రమాణ స్వీకార వేదిక మీద నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంభీరమైన ప్రకటనలు చేశారు. పోలవరం, పీపీఎల్లో వేల కోట్ల అవినీతి జరిగిందని… అవన్నీ ప్రజల ముందు పెడతామని ప్రకటించారు. కానీ అన్నింటిలోనూ.. రివర్స్ గా.. క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు.
పోలవరం, పీపీఏల్లో చంద్రబాబు సర్కార్ కు క్లీన్ చిట్..!
పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి వేల కోట్ల అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ నివేదిక తెప్పించారు జగన్. దాన్ని కేంద్రానికి ఇచ్చారు. ఆధారాలు కావాలని అడగడంతో.. ఏపీ సర్కార్ మాట మార్చింది. పోలవరంలో తప్పులేమీ లేవని… సవివరణంగా …రివర్స్ నివేదికను సమర్పించి వచ్చింది. కానీ ఏపీలో దానికి భిన్నమైన ప్రచారం చేస్తున్నారు. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలోనూ.. జగన్మోహన్ రెడ్డి చివరికి రివర్స్ నిర్ణయం తీసుకోక తప్పలేదు. గత ప్రభుత్వం ఎక్కువ రేటుకు కరెంట్ కొన్నదంటూ… అధికారం చేపట్టిన వెంటనే… విద్యుత్ సంస్థలకు చెల్లింపులు నిలిపివేశారు. యాజమాన్యాలను పిలిచి బెదిరించినంత పని చేశారు. కేంద్రం హెచ్చరించినా ఖాతరు చేయలేదు. చివరికి కేంద్రం… వాత పెట్టినంత పని చేసింది. కోర్టు కూడా.. అదే చెప్పింది. ఇప్పుడు పీపీఏల జోలికి వెళ్లలేని పరిస్థితి. అవినీతి జరగలేదని… స్వయంగా క్లీన్ చిట్ ఇప్పించిన దుస్థితి.
ప్రతిపక్షంగా చేసిన ఆరోపణలన్నీ రివర్సై గుచ్చుకుంటున్నాయి..!
కీలకమైన నిర్ణయాల్లో ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు.. ఇలా రివర్స్ అవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఎన్నింటినో కుంభకోణాలు చెప్పిన జగన్.. ఇప్పుడు తానే వాటిని చేయాల్సి వస్తోంది. పోలవరం రివర్స్ టెండర్లకు ఎంపిక చేసిన మ్యాక్స్ ఇన్ ఫ్రా, మేఘా ఇంజినీరింగ్ సంస్థలపై ఎన్నో ఆరోపణలు చేశారు. ఇప్పుడు వాటినే నిజాయితీకి నిలువుటద్దాలుగా చూపిస్తున్నారు. శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని నల్లతాచుగా అభివర్ణించారు. ఆయనను మళ్లీ టీటీడీ బోర్డులోకి తీసుకున్నారు. బోటు ప్రమాదం జరిగితే.. రూ. పాతిక లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రతిపక్ష నేతగా ఆరోపించారు. సీఎంగా రూ. పది లక్షలే ఇచ్చారు. కనీసం బోటును బయటకు తీయలేకపోయారు. పేపర్ లీకేజీపైనా అదే తరహా రివర్స్ దెబ్బలు కనిపిస్తున్నాయి. దీంతో జగన్ ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తోంది.
మీడియాపై నిషేధమూ “రివర్స్” కాక తప్పలేదు..!
ఇక తమకు ఎదురే లేదన్నట్లుగా…మీడియాపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేసిన ఏపీ సర్కార్ కు టీడీశాట్ షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా… చానల్స్‌ను ఫైబర్ నెట్ నుంచి తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సాంకేతిక సమస్యలనే సాకులు చెప్పకుండా.. రెండు రోజుల్లో.. ఫైబర్ నెట్లో చానల్స్‌ను ప్రసారం చేయాలని ఆదేశించింది. దీంతో.. మరో నిర్ణయం రివర్స్ అయినట్లయింది. ఇలా.. అన్నింటిలోనూ జగన్ కు రివర్స్ అవుతోంది. దిద్దుకోకపోతే… అనతి కాలంలోనే… సర్కార్ పై ఓ రకమైన ముద్ర పడిపోతుంది.