ఏపీ ప్రభుత్వం భూములపై కన్నేసింది. ప్రభుత్వ భూమి అంగుళం వదలకుండా అమ్మేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంది. ముందుగా యూనివర్సిటీ భూములపై పడ్డారు. యూనివర్శిటీల భూముల అమ్మాలంటే.. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ పర్మిషన్ కావాలి. తలకిందులు తపస్సు చేసినా.. పర్మిషన్ రాదు. ఇలాంటి చిక్కులు లేకుండా.. చేయడానికి ఏకంగా చట్టాన్ని తేవాలని జగన్ నిర్ణయించారు. అంటే.. ఎలాంటి భూమినైనా తెగనమ్మేసే అధికారం కట్టబెట్టుకుందుకు జగన్ రెడీ అయ్యారు.
ఇప్పుడు అమ్ముతారు సరే..! తర్వాత అవసరాలకు ప్రజల భూములే లాక్కోవాలిగా..!?
ప్రభుత్వానికి భూములు ఎక్కడి నుంచి వస్తాయి..?… ప్రజల నుంచే సేకరిస్తారు. ప్రజా ప్రయోజనాల కోసం అంటూ.. భూసేకరణ చేస్తారు. ఇప్పుడు ప్రభుత్వం అమ్మకానికి పెట్టాలనుకుంటున్న భూముల్లో ఎక్కువ శాతం ఇలా సేకరించినవే. స్వాతంత్రం వచ్చిన తర్వాత భూగరిష్ట పరిమితిచట్టాల ప్రకారం దఖలు పడిన భూములు కొన్ని.. ఇతర విధాలకు వచ్చిన భూములు మరికొన్ని. వాటన్నింటినీ ఇప్పుడు ప్రభుత్వం తెగనమ్మేస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన పథకాలకు పంచేస్తుంది. కానీ భవిష్యత్ అవసరాల సంగతేంటి..?. పెరుగుతున్న ప్రజల అవసరాలకు అనుగుణం.. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. అప్పుడు భూములు ఎక్కడి నుంచి వస్తాయి..?
సంపద పెంచే ప్రభుత్వాలను చూశాం కానీ తెగనమ్మే సర్కార్‌ని ఇప్పుడే చూస్తున్నాం..!
మళ్లీ ప్రభుత్వం భూసేకరణ నోటీసులు జారీ చేసి.. ప్రజల భూములను సేకరించాల్సి ఉంటుంది. చిక్కులున్నా భూములమ్మడంపై ప్రభుత్వం వెనుకకు తగ్గాలనుకోవడం లేదు. భూములమ్మడం నష్టదాయమని తెలిసినా ప్రభుత్వం ముందుకెళ్తోంది. భూముల అమ్మకం వలన ప్రజలకు పప్పు బెల్లాల రూపంలో కొంత సాయం అందవచ్చేమో కానీ.. తర్వాత అంతకు మించి ప్రజల వద్ద నుంచి లాగేసే పరిస్థితి ప్రస్తుత ప్రభుత్వ విధానం వల్ల వస్తుంది. సంపద పెంచే ప్రభుత్వాలను చూశాం కానీ.. ఇలా తెగనమ్మేసే ప్రభుత్వాన్ని మొదటి సారి చూస్తున్నామనే అభిప్రాయం అంతటా వ్యాపిస్తోంది.
ఐదేళ్ల అవకాశం పొందే పాలకులు ఆస్తులు తెగనమ్మగలరా..?
భూమి అనేది.. బంగారు బాతు లాంటిది. దాన్ని అమ్మేసుకోకూడదు. దాని నుంచి.. ఆదాయం పొందేలా చూసుకుని ప్రజలకు మేలు చేయాలి. అంతే కానీ.. ఇప్పుడు… ఆ బంగారు బాతును కత్తిరించేసి.. దాని కడుపులో ఉన్న ఒకటి, రెండు గుడ్లతో.. ప్రజల కడుపు నింపుతాం.. తర్వాతి సంగతి తర్వాత అంటే.. నష్టపోయేది ప్రజలే. ఒక్క చాన్స్ తీసుకుని.. ఎన్నికల్లో గెలిచి.. ఐదేళ్ల తర్వాత.. మళ్లీ వస్తారో రారో.. తెలియని పాలకులు కాదు.