అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది. రాజధాని నిర్ణయాన్ని కొందరు టీడీపీ నేతలకు చంద్రబాబు ముందే చెప్పారు. వారు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటన తర్వాత భారీ మొత్తానికి అమ్మారు. ఇది ఇన్ సైడ్ ట్రేడింగే. సీబీఐ విచారణ కావాలంటూ డిమాండ్ చేసిన వైసీపీ… అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్ష్యాల కోసం.. వెదుకులాడుతోంది. రాజధాని భూ సమీకరణలో భాగంగా రైతులు ఇచ్చిన 33 వేల 567 ఎకరాల్లో… ప్రభుత్వ ఏర్పాటుకు.. రాజధాని ప్రకటనకు మధ్య జరిగిన లావాదేవీలు 170 ఎకరాలకు అటూ ఇటుగానే ఉన్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చింది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లో రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు అసెంబ్లీలో 2014 డిసెంబర్ 8వ తేదీన తీర్మానం చేశారు. మొదట్లో మద్దతు పలికిన వైసీపీ… రెండేళ్ల తర్వాత అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని భూసమీకరణలో భారీ కుంభకోణం జరిగిందని, ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించింది. తన అనుచరులకు, పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిని తుళ్లూరులో ఏర్పాటు చేస్తున్నట్టు ముందుగానే తన అనుచరులకు చెప్పారని, వారు భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి. .. అమ్ముకున్నారని .. మరికొంతమంది వాటిని తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వైసీపీ ఆరోపించింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో ఉండగా చేసిన ఆరోపణలపై విచారించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆదేశాల మేరకు సీఆర్డీఏ అధికారులతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్, సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. రాజధానిలో చంద్రబాబు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన నాటినుంచి ఆయన రాజధానిని ప్రకటించే వరకు ఆరు నెలల కాలంలో ఎంతవరకు కొనుగోళ్లు జరిగాయో లెక్కలన్నీ తీశారు. ఐదేళ్ల కాలంలో మొత్తంగా.. అమరావతిలో జరిగిన లావాదేవీలు 1170 ఎకరాలేనని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇక ఇన్ సైడ్ ట్రేడింగ్ జరగడానికి అవకాశం ఉన్న సమయంలో లావాదేవీలు 170 ఎకరాలు మాత్రమే. వీటిని ఎలా పెద్దగా చూపించాలన్నదానిపై.. సర్కార్ కసరత్తు చేస్తోందంటున్నారు.