రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. బినామీ పేర్లతో టీడీపీ నేతలు భూములు కొనుగోలు చేశారని నిరూపించాలనే ప్రయత్నంలో… ఏపీ సర్కార్ నేరుగా రైతుల ఇళ్లకే అధికారుల్ని పంపిస్తోంది. 2014లో ఎన్నికలు ఫలితాలు వచ్చినప్పటి నుండి రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించే వరకూ… సీడ్ క్యాపిటల్ పరిధిలో ఎన్ని భూక్రయవిక్రయాలు జరిగాయో.. ఆ లిస్ట్ రెవిన్యూ అధికారులకు ఇచ్చి… వారు ఎవరికి అమ్మారు..? ఎంతకు అమ్మారు..? ఎవరికి రిజిస్ట్రేషన్ చేశారు..? వంటి వివరాలు తీసుకు రావాలని పంపారు. దాంతో.. గత రెండు, మూడు రోజులుగా.. సీఐడీ అధికారులు.. నాలుగైదేళ్ల కిందట.. భూములు అమ్మిన వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ కారణంగా రైతుల్లో అలజడి ప్రారంభమయింది.
నిజానికి రాజధానిలో కొన్ని వేల ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని… వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాదించారు. బినామీల పేర్లతో వందల ఎకరాలను టీడీపీ నేతలు కొనుగోలు చేశారన్నారు. ఇప్పుడు.. వైసీపీనే అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటిపోయింది. రికార్డులు, రిజిస్ట్రేషన్ల వివరాలు మాత్రమే కాదు.. విచారణ యంత్రాంగం మొత్తం చేతిలోనే ఉంది. అయినా ఇప్పటి వరకూ.. ఒక్కటంటే.. ఒక్క ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాన్ని బయట పెట్టలేకపోయారు. సుజనా చౌదరికి ఆయన అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లో … అదీ కూడా.. తెలంగాణ సరిహద్దులో ఉన్న కృష్ణా జిల్లా గ్రామంలో… వారసత్వంగా వచ్చిన భూములను చూపించి.. అదే ఇన్ సైడర్ ట్రేడింగ్ అని వాదించంబోయి.. మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శల పాలయ్యారు. అప్పుడు విసిరిన చాలెంజ్‌ను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ప్రత్యేకంగా కొంత మంది సీఐడీ అధికారులను నియమించి… విచారణ జరిపిస్తోంది.
నిజానికి వైసీపీ ఆరోపిస్తున్న సమయంలో… రాజధాని ప్రాంతంలో లావాదేవీలు జరిగింది కేవలం 180 ఎకరాలేనని అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అవి కూడా.. టీడీపీ నేతలకు.. రైతులకు అమ్మలేదు. సాధారణ లావాదేవీలు మాత్రమే జరిగాయని చెబుతున్నారు. అయితే వాటిలో… టీడీపీ నేతలు బినామీలున్నారంటూ… ఎలాగోలా నిరూపించాలని… తాము గతంలో చేసిన ఆరోపణలు నిజమని.. బయట పెట్టుకోవాలని.. వైసీపీ అగ్రనాయకత్వం తాపత్రయ పడుతోంది. అందుకే.. ఎలాంటి అవకతవకాలు గుర్తించకపోయినా.. ఎలాగోలా.. లొసులుగు పట్టుకోవాలని.. రైతుల వద్దకు సీఐడీ అధికారుల్ని పంపుతోంది. మరి ప్రభుత్వ ప్రయత్నం సక్సెస్ అవుతుందో లేదో..!