వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి.. మాజీ సీఎం చంద్రబాబు సెక్యూరిటీని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. ఆయనకు నక్సలైట్లు, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఉన్న ముప్పు.. గతంలో జరిగిన దాడులు, మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న కారణంగా.. కేంద్రం ఆయన జడ్‌ప్లస్ సెక్యూరిటీని కల్పించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ రక్షణ ఉంటుంది. అయితే.. అసలు రక్షణ బాధ్యత మాత్రం.. రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం.. ఎన్ఎస్జీ ఉంది కదా.. మేమెందుకు సెక్యూరిటీ ఇవ్వాలన్నట్లుగా కోర్టులో వాదించింది. భద్రత విషయంలో చంద్రబాబు వేసిన పిటిషన్‌పై.. హైకోర్టులో ప్రభుత్వం .. అదే పనిగా మాటలు మార్చిందనే.. విమర్శలు వినిపిస్తున్నాయి.
మొదట చంద్రబాబుకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ కంటే.. ఎక్కువే ఇస్తున్నామని… రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై సమగ్ర సమాచారంతో.. ప్రమాణపత్రం దాఖలు చేయాలని.. హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కానీ అడ్వకేట్ జనరల్ అలాంటి.. ప్రమాణపత్రం దాఖలు చేయలేదు. చంద్రబాబు భద్రత.. ఎన్‌ఎస్‌జీదేనని వాదించారు. దాంతో.. కేంద్రం తరపున అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. మోబిలిటీలో మాత్రమే ఎన్ ఎస్ జి చంద్రబాబు భద్రత భాద్యతలు చూసుకుంటుందని, నివాసం, ఆఫీసుల్లో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వమే భద్రత కల్పించాల్సి ఉందన్నారు. ఈ మేరకు నిబంధనలు చూపించారు.
2004-14 మధ్య ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ చంద్రబాబుకు ఇద్దరు సిఎస్ ఓలతో భద్రత కల్పించగా దానిని ప్రస్తుతం ఒక్కరికి కుదించారనే విషయాన్ని న్యాయమూర్తి ముందు చంద్రబాబు తరపు న్యాయవాది ఉంచారు. దీనిపై ప్రభుత్వం ప్రస్తుతం ఓ సీఎస్‌వో ఇరవై నాలుగు గంటలూ పని చేస్తున్నారని.. వాదించింది. ఇరవై నాలుగు గంటలూ ఒకే సీఎస్‌వో ఎలా విధులు నిర్వహిస్తారని.. కోర్టు ప్రశ్నించడంతో.. ప్రభుత్వ న్యాయవాదుల వద్ద సమాధానం లేకపోయింది. రాజకీయ కారణాలతో తన భద్రతను తగ్గించారని.. కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించారని.. పునరుద్దరించేలా ఆదేశించాలని.. చంద్రబాబు తరపున న్యాయవాదులు కోరారు. కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అయితే.. చంద్రబాబు భద్రత మొత్తం ఎన్ఎస్జీ బాధ్యతన్నట్లుగా .. ఏపీ పోలీసులు మాట్లాడటం.. భద్రత తగ్గించలేదని చెబుతున్నా.. పూర్తి వివరాలు వెల్లడించడానికి సిద్ధపడకపోవడంతో.. రాజకీయవర్గాల్లో చర్చకు కారణం అవుతోంది. చంద్రబాబు భద్రతను ప్రశ్నార్థకం చేసి.. ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోందన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.