న్యాయవివాదాలు రాకుండా.. కోర్టుల్లో ఇబ్బంది రాకుండా.. ఎలా రాజధానిని తరలించాలా.. అని ప్రభుత్వ పెద్దలు.. న్యాయనిపుణులతో గంటల తరబడి సంప్రదింపులు జరుపుతున్నారు. అదే సమయంలో వారి ముందు ఉన్న సవాల్.. మండలిలో బిల్లును గట్టెక్కించుకోవడం. మండలిలో టీడీపీకి మెజార్టీ ఉంది. ఈ రెండు సమస్యల పరిష్కారానికి.. వారికి కనిపిస్తున్న ఒకే ఒక్క మార్గం మనీ బిల్లు. మనీ బిల్లుగా పేర్కొంటూ… కొత్త చట్టాన్ని.. ప్రవేశపెడితే.. తమ పని సులువు అవుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. సాధారణంగా మనీ బిల్ అంటే.. కేవలం ఖర్చుల ఆమోదం కోసం పెట్టే బిల్లులు. ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా.. ఖచ్చితంగా అసెంబ్లీ ఆమోదం తీసుకోవాలి. అలా ఆమోదం తీసుకునే బిల్లులను ద్రవ్య బిల్లులంటారు.
నిబంధనల ప్రకారం.. ఈ ద్రవ్య బిల్లులను.. అసెంబ్లీ ఆమోదించి… మండలి ఆమోదించకపోతే.. 14 రోజుల్లో ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్లుగా అవుతుంది. మండలి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ ఆప్షన్ వినియోగించుకోవాలని అనుకుంటోంది. కానీ ఇది న్యాయపరమైన చిక్కులకు దారి తీసే అవకాశం ఉంది రాజ్యాంగంలోని ఆర్టికల్ 199 ప్రకారం కేవలం మనీ బిల్లులు ఆర్థిక అంశాలు తప్ప.. ఇతర ఏవీ ఉండకూడదు. కానీ ప్రభుత్వం.. వాటిలోనే.. సీఆర్డీఏ చట్టం రద్దు, రాజధాని తరలింపు కోసం పరోక్ష నిర్ణయాలు పెట్టనుంది. ఇవి ఉంటే మనీ బిల్లు అయ్యే అవకాశం లేదని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. కోర్టు కొట్టి వేస్తుందని అంటున్నారు. అదే సమయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా.. రాజధాని తరలింపు అనే మాట బిల్లులో రాకుండా జాగ్రత్త పడుతోంది ప్రభుత్వం.
మూడు డెలవప్మెంట్ కౌన్సిళ్లను ఏర్పాటు చేస్తామని.. పాలన మూడు చోట్ల నుంచి సాగుతుందని మాత్రమే.. బిల్లులో పెట్టనున్నారు. ప్రభుత్వం సీఆర్డీఏ రద్దును.. డొంక తిరుగుడుగా.. ద్రవ్య వినిమయ బిల్లుగా మార్చినప్పటికీ.. సీఆర్డీఏ చట్టం రద్దుగా పరిగణించలేమని న్యాయనిపుణులు ప్రభుత్వానికి సూచించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఏం చేయాలన్న దానిపై.. ప్రభుత్వం.. అదే పనిగా.. రాజ్యాంగ, న్యాయనిపుణలతో చర్చోపచర్చలు జరుపుతోంది.