వైకాపా నుంచి వరుసగా ఎమ్మెల్యేలు తెదేపాలో చేరిపోతుండటంతో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఆయన నిస్సహాయత చూసి పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిలో తక్షణం ఏదో ఒకటి చేయకపొతే ఇంకా వేగంగా పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందని జగన్ గ్రహించే ఉంటారు. బహుశః అందుకే డిల్లీ ప్రయాణం పెట్టుకొని ఉంటారని తెదేపా నేతలు వ్యాఖ్యానించడం నిజమేనని నమ్మక తప్పదు. అయితే డిల్లీ వెళ్ళినా వైకాపాని ఎవరూ కాపాడలేరని వారు చెపుతున్నారు. అలాగని జగన్ చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోలేరు కనుక డిల్లీలో తను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. జాతీయపార్టీల నేతలను, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసి తెదేపాపై పిర్యాదు చేసారు. తెదేపా ప్రభుత్వ అవినీతి గురించి వైకాపా ప్రచురించిన పుస్తకాన్ని రాజ్ నాథ్ సింగ్ చేతిలో పెట్టి తక్షణమే తెదేపా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎవరూ ఊహించలేని ఒక మాట చెప్పారు. చంద్రబాబు నాయుడు అవినీతిపై సిబీఐ చేత విచారణ జరిపించాలని తను కోరగా హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. అదే విషయాన్నీ సాక్షి మీడియాలో కూడా వేసుకొని రాష్ట్ర ప్రజలకి ఆ సందేశం చేరవేశారు. అయితే ఓటుకి నోటు కేసులో పూర్తి సాక్ష్యాధారాలతో నమోదు చేసిన కేసులనే కేంద్రప్రభుత్వం పట్టించుకోనప్పుడు, జగన్ ప్రచురించిన పుస్తకాన్ని పట్టుకొని సిబీఐ విచారణకు ఆదేశిస్తుందనుకొంటే అది అవివేకమే అవుతుంది. పైగా నేటికీ రాష్ట్రంలో తెదేపా, భాజపాలు మిత్రపక్షాలుగానే కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడుకి పూర్తి మద్దతు ఇస్తున్న వెంకయ్య నాయుడు డిల్లీలో ఉండనే ఉన్నారు. కనుక ఆ వార్తలో నిజం లేకపోయినప్పటికీ అది వైకాపా శ్రేణులకు ఉత్సాహం కలిగించడానికి తప్పకుండా ఉపయోగపడవచ్చు. బహుశః అందుకే హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సిబీఐ విచారణకు సానుకూలంగా స్పందించారని సాక్షిలో వ్రాసుకొన్నట్లు భావించవచ్చు. అది చూసి ప్రజలు పాపం జగన్ కి అదో తుత్తి! అని అనుకోకుండా ఉండలేరు.