ఎన్నికల తర్వాత తాను నరేంద్రమోడీ వైపే ఉంటాననే సంకేతాన్ని .. జగన్మోహన్ రెడ్డి.. జాతీయ మీడియా ఇంటర్యూల్లో నేరుగా ఇచ్చేశారు. ఇంగ్లీష్ చానల్ ‘టైమ్స్ నౌ’ కు ఇచ్చిన ఇంటర్యూలో.. మోడీపై.. జగన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నికల తర్వాత మోదీనే ప్రధానమంత్రి అవుతారని నేరుగా చెప్పడం ద్వారా తాను ఎటు వైపో చెప్పకనే చెప్పేశారు. నరేంద్రమోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ధృడచిత్తం ఉన్న నాయకుడని కితాబిచ్చారు. ఎన్నికల తర్వాత దక్షిణాది ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ బీజేపీ వైపే ఉంటుందని జాతీయ చానళ్లు చాలా రోజుల నుంచి చెబుతున్నాయి. దీనిపై జగన్మోహన్ రెడ్డి నేరుగా క్లారిటీ ఇచ్చినట్లయింది.
విభజన హామీల విషయంలో ఏపీని దారుణంగా మోసం చేసిన మోదీపై.. స్వరాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత ఉండగా.. జగన్ మాత్రం వెనకేసుకు వస్తున్నారు. బీజేపీ నేతలు… మోదీ సహా.. ఎవరు ఏపీకి వచ్చినా… చంద్రబాబును విమర్శించి పోతున్నారు… కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనడం లేదు. అలాగే.. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి కూడా.. బీజేపీ కానీ.. విభజన హామీలను అమలు చేయని మోదీని కూడా విమర్శించడం లేదు. కానీ.. జాతీయ మీడియాకు ఇస్తున్న ఇంటర్యూల్లో మాత్రం.. పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మోదీ మళ్లీ ప్రధాని అవుతారంటూ జోస్యం చెబుతున్నారు. కేసీఆర్ పైనా… జగన్మోహన్ రెడ్డి.. అభిమానం చూపిస్తున్నారు. ఏపీకి ప్రత్యేకహోదాకు అవసరం అయితే లేఖ రాస్తానన్న ఒక్క మాటకే కేసీఆర్ పై…ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కేసీఆర్ ఏపీ కోసం ఆలోచిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. నిజానికి.. కాంగ్రెస్ పార్టీ ఏకంగా… ప్రత్యేకహోదా ఇస్తామన్న విషయాన్ని మేనిఫెస్టోలోనే పెట్టింది. అయినప్పటికీ… కాంగ్రెస్ పార్టీ కన్నా… కేసీఆరే… జగన్మోహన్ రెడ్డికి గొప్పగా కనిపిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకహోదా ఇస్తామన్న విషయంపై స్పందించడానికి నిరాకరించిన జగన్… రాహుల్ గాంధీపై మాత్రం సెటైర్లు వేస్తున్నారు. అమేధీలో ఓడిపోతారని.. అందుకే కేరళ నుంచి పోటీ చేస్తున్నారని సెటైర్లు వేశారు. ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ మద్దతిస్తున్నారని, ఆ మద్దతు ఏపీకి అత్యవసరమన్న జగన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు కన్నా.. కేసీఆర్ మద్దతు ఎలా గొప్పదో.. మాత్రం జగన్ విశ్లేషించలేకపోయారు. దక్షిణాదిలో తాము సీట్లు సాధించకపోయినా రహస్య మిత్రులు సాధిస్తే చాలనుకున్న బీజేపీకి జగన్ ఈ విధంగా అభయం ఇచ్చారు. ఓ విధంగా.. ఇక్కడ కేసీఆర్కు.. ఢిల్లీలో మోడీకి.. జగన్ వంగిపోయాడన్న అభిప్రాయం.. టైమ్స్ నౌ ఇంటర్యూలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో స్పష్టమయింది.