హైదరాబాద్: ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరవటానికి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రవీంద్రభారతి సమీపంలోని ప్రకాశం పంతులు విగ్రహంనుంచి ఊరేగింపుగా అసెంబ్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్లో టీడీపీ నేతల ప్రమేయం ఉందని జగన్ ఆరోపించారు. కేసును పక్కదారి మళ్ళించటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ దౌర్భాగ్యపు రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. కాల్‌మనీ వ్యాపారాన్ని వడ్డీ వ్యాపారం అన్నట్లుగా వడ్డీ వ్యాపారులమీద దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కాల్‌మనీ దందాలో సీఎం చంద్రబాబు డబ్బుకూడా ఉందని అన్నారు.
అసెంబ్లీ వద్దకు పాదయాత్రగా చేరుకున్న జగన్, ఆయన ఎమ్మెల్యేలను గేటు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు లోపలకు తీసుకురావద్దంటూ సూచించారు. దీనిపై జగన్ మండిపడ్డారు. పోలీసులను చంద్రబాబు తనకు అనుకూలంగా వాడుకుంటున్నారని అన్నారు. తాము అసెంబ్లీ గేటువద్దే ఉంటామని, అవసరమైతే టీడీపీ ఎమ్మెల్యేలను కూడా లోనికి పోనివ్వమని చెప్పారు. రాష్ట్రం మొత్తం చంద్రబాబును తిట్టిన తిట్లు తిట్టకుండా తిడుతోందని, అసెంబ్లీ జరిపించుకుంటారా, లేదా అన్న విషయాన్ని ఆయనకే వదిలిపెడతామని అన్నారు. పోలీసులకు, ప్రతిపక్ష నేతకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఛీఫ్ మార్షల్ బయటకొచ్చి పోలీసులకు నచ్చచెప్పిన తర్వాత ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీలోనికి అనుమతించారు.