అధికారం తలకెక్కితే ఎన్నో అనర్థాలకు కారణం అవుతుందని…తీరా తప్పు తెలుసుకునే లోపు జరగాల్సిన పూడ్చలేని నష్టం జరిగిపోతుందని సీనియర్ నాయకులు చెప్తుంటారు. ఇప్పుడు ఇది మాజీ సీఎం జగన్ కు సరిగ్గా సరిపోయేలా ఉంది.
వైసీపీకి, జగన్ కు రాయలసీమ పెట్టని కోట. కూటమి గెలుస్తుందని చెప్పిన పోస్ట్ పోల్ సర్వేలన్నీ… రాయలసీమలో జగన్ మెజారిటీ సీట్లు వస్తాయని, పట్టు నిలుపుకుంటారని అంచనా వేశాయి. అలాంటి చోట కూడా జగన్ పార్టీ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకు పోయింది. స్వయంగా కడపలోనే వైసీపీ ఓడిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈవీఎంలు, నాయకుల నోటి దూల, అవినీతి ఇలా చెప్పుకుంటూ తమను తాము సర్ధిచెప్పుకుంటున్నా… జగన్ మూలల్లోకి తొంగి చూసుకుంటున్నట్లు ఉన్నారు. అందుకే పోయిన చోట వెతుక్కునే పనిలో పులివెందులకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వైఎస్ ఫ్యామిలీ అడ్డాగా ఉన్న కడప జిల్లాలో… ఆ మాటకొస్తే పులివెందులలోనూ వారి పునాదులు కదిలాయి. కూటమి దెబ్బకు వైఎస్ సెంటిమెంట్ ఏమాత్రం పనిచేయలేదు. దీంతో జగన్ మొదట సొంత జిల్లా పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. రెండ్రోజుల పాటు జగన్ పులివెందులలోనే ఉండటంతో పాటు సీమ నేతలు, కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సీట్లు ఓడిపోయినా… క్యాడర్ మిగిలింది. కానీ, క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్న నేపథ్యంలో, క్యాడర్ చేజారిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో జగన్ పులివెందుల పర్యటనకు వెళ్తున్నట్లుగా కనపడుతోంది.
ఓడినా… జనంతోనే ఉండేందుకు షర్మిల స్పీడ్ గా అడుగులు వేస్తుండటం, మరోవైపు కూటమి దెబ్బకు కోలుకోలేని దెబ్బతిన్న తన క్యాడర్ కాపాడుకునేందుకే ఈ హాడావిడి పర్యటన చేపట్టినట్లు ప్రచారం జరుగుతోంది.