ఆధునిక ప్రజాస్వామ్యంలో తనకు తాను రాజుగా ఊహించుకుని .. ప్రజల డబ్బుల్ని కాస్త తిని కాస్త వారికి పంచిపెట్టి అదే ప్రజా సేవ, తనను దేవుడ్ని అనుకోవాలని పరితపించుకుని అలా ప్రచారం చేసుకునే జగన్మోహన్ రెడ్డి కి కాలు బయట పెట్టక తప్పడం లేదు. తాను దేవుడ్ని ఆయన ఎంత తన మనసులో అనుకున్నా… లక్షల కోట్లు అప్పు చేసి.. అందులో కొంత ప్రజలకు పంచాను కాబట్టి… తప్పనిసరిగా ఓటేయాల్సిందేనని వారి మెడపై వాలంటీర్ల దగ్గర్నుంచి అత్యున్నత స్థాయి వారి వరకూ కత్తులు పెట్టి నిల్చోబెట్టినా… ఆయన వెళ్లి ఓటు అడగాల్సిందే. అదే ప్రజాస్వామ్యం. అందుకే ఆయన ఇప్పుడు బయటకు వస్తున్నారు.
ఇంత కాలం ఆయన వస్తే చెట్లు నరికివేతలు, పరదాలు కట్టడం, ఐ ప్యాక్ ఆర్టిస్టులు వచ్చి హడావుడి చేయడం అనేది కామన్‌గా ఉంటుది. ఇప్పుడు కూడా అది ఉంటుంది. కానీ బటన్ నొక్కే ప్రోగామ్స్ వేరు ఇప్పుడు జనంలోకి వెళ్లి ఓట్లు అడగడం వేరు. అయితే ప్రచారానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరూ ప్రశ్నించకుండా… తాను చెప్పేది మాత్రమే వినాలనే సెటప్ ఏర్పాటు చేసుకుటంున్నారు. ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం అని పెట్టుకున్నారు కానీ.. ఎంపిక చేసిన వారికి మాత్రమే మైక్ ఇచ్చే ఏర్పాట్లు ఐ ప్యాక్ పర్యవేక్షణలో పూర్తయ్యాయి.
అధికారం చేపట్టిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి సమీక్షల్లో ఓ మాట చెప్పేవారు. అదేమిటంటే.. తాను త్వరలో గ్రామాల పర్యటనకు వెళ్తాను… గ్రామ సభల్లో ఎవరైనా పథకం అందలేదని చేయి ఎత్తకూడదు. అని చెప్పేవారు. ఆయన గ్రామాల్లో పర్యటించిది లేదు.. ప్రజల సమస్యలను పరిష్కరించిందీ లేదు. ఇప్పుడు గత నాలుగు నెలలుగా ఆయన నొక్కిన బటన్లకు సంబంధించిన డబ్బులు ఇంకా అకౌంట్లలో పడలేదు. ఇలాంటి సమయంలో ఆయన దగ్గరకు ప్రజల్ని వదిలిస్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఈ విషయం తెలియని వారు కాదు వైసీపీ వ్యూహక్తలు.
తొమ్మిదేళ్ల పాటు ఏదో ఓ పని పెట్టుకుని ప్రజల్లో ఉండి… పాదయాత్ర చేసి… అధికారం రాగానే కాలు కింద పెట్టకుండా పరిపాలన చేశారు. తాను ఒక్కడే మహారాజులాగా కుర్చీలో కూర్చుని పని చేయని బటన్లు నొక్కుతూంటే.. ఆయన వెనుక సీఎస్, డీజీపీ నిలబడి ఉండేలా చేసుకుని ఓ నియంత స్వామ్యాన్ని నెలకొల్పారు. ఇప్పుడు తప్పని సరిగా ప్రజల వద్దకు వెళ్లాల్సి ఉంది. వారి ముందు మోకరిల్లి ఓట్లు అడుగుతారా.. లేకపోతే.. ఓట్లు వేయకపోతే మీ ఖర్మ అని బెదిరించి వస్తారా చూడాల్సి ఉంది.