రైతు దినోత్సవం పేరుతో సభ పెట్టి చంద్రబాబు.. నామ జపం చేశారు సీఎం జగన్ రెడ్డి. ఖరీఫ్ లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం బటన్ నొక్కుతామంటూ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు అప్పడు ఇలా చేశారు.. ఇప్పుడు నేను ఇలా చేస్తున్నానని చెప్పుకోవడమే ప్రసంగమైపోయింది. చంద్రబాబు హయాం కంటే రెట్టింపు పరిహారం రైతులకు ఇచ్చామనిచెప్పుకొచ్చారు. నాలుగేళ్లలో కోటిన్నర రైతులకు రూ.30 వేల 985 కోట్లు రైతు భరోసా ఇచ్చామని చెప్పుకొచ్చారు.
తాను చంద్రబాబులా అబద్దాలు చెప్పనంటూనే అన్నీ అబద్దాలు చెప్పుకొచ్చారు. ఏ సంవత్సరం కూడా యాభై లక్షల మంది రైతులకు భరోసా ఇవ్వలేదు. కానీ కోటిన్నర లెక్క చెప్పారు. అసలు రైతు స్థీరీకరణ నిధి అన్నదే పెట్టలేదు.కానీ రూ. మూడు వేల కోట్లతో నిధి పెట్టేశామని చెప్పుకొచ్చారు. పరిహారం ఇవ్వడం లేదని.. చంద్రబాబు గజ దొంగల ముఠా మొసలి కన్నీరు కారుస్తోందని.. కరువు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు.
రైతులు పండించిన పంటను తీసుకుని వారికి చెల్లించే డబ్బులను సాయం గా చెప్పుకొచ్చారు జగన్. రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని ప్రకటించేశారు. అసలు ఎక్కడా తొమ్మిది గంటల కరెంట్ ఊసే లేదు. కానీ ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి మాత్రం ఆయన చేయని ప్రయత్న లేదు మనకు పాడిపంటలు ఉండే పాలన కావాలా? లేక నక్కలు, తోడేలు ఉండే పాలన కావాలా? .. రైతు రాజ్యం కావాలా? రైతులను మోసం చేసే పాలన కావాలా? రైతుకు తోడుగా ఆర్భీకే వ్యవస్థ కావాలా? దళారీ వ్యవస్థ కావాలా?. పేదల ప్రభుత్వం కావాలా? పెత్తందారుల ప్రభుత్వం కావాలా?. అంటూ ఆయన రాగయుక్తంగా వేలంపాటలా పాడి వెళ్లారు.
పేరుకు వైఎస్ రైతు దినోత్సవమే కానీ.. ఆయనను స్మరించుకోకపోవడం.. చర్చనీయాంశమయింది.