తెలంగాణలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటమే కాదు లోపాయికారీగా టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయడాన్ని కూడా తప్పు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పోరాటయాత్రలో బహిరంగసభలో పాల్గొన్న జగన్మోహన్ రెడ్డి… తెలంగాణలో ఎన్నికలొస్తే.. చంద్రబాబు సొంత రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినట్లుగా.. హడావుడి చేశారని విమర్శించారు. ఏపీ సమస్యలను గాలికొదిలేసి ప్రచారం చేశారని మండిపడ్డారు. అంతే కాదు.. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కూడా.. వైఎస్ చేసిన అభివృద్ధి పనుల్ని చంద్రబాబు చేసినట్లు చెప్పుకున్నారని విమర్శించారు.
హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు దివంగత సీఎం వైఎస్ హయాంలో పూర్తయితే అది తన ఘనతగా చంద్రబాబు చెప్పుకొంటున్నారని విమర్శించారు. అసలు చంద్రబాబు హయాంలో వాటికి అంకురార్పణ జరిగిందని…వైఎస్ పదవిలోకి వచ్చే సరికే.. సగానికిపైగా పూర్తయ్యాయన్న విషయాన్ని జగన్ మర్చిపోయారు. ఔటర్ రింగ్ రోడ్డు గురించి వైఎస్ హయాంలో జరిగిన విన్యాసాలు గురించి కథలు కథలుగా ఇప్పటికీ చెప్పుకుంటారు. ఔటర్ అష్టవంకర్లు ఎలా తిరిగిందో.. జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అయినప్పటికీ.. దాన్ని వైఎస్ ఖాతాలో వేసి.. చంద్రబాబేం చేయాలేదని చెప్పడానికి తాపత్రయ పడ్డారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఓడించాలని తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలంగాణ ఎన్నికల విషయంలో వైఎస్ జగన్ తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని.. ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శించినా.. ఆయన మాత్రం..
ఆ పార్టీని పల్లెత్తు మాట అనుకుండా బహిరంగంగా ప్రకటించకపోయినా.. టీడీపీని ఓడించాలన్న లక్ష్యంతో పార్టీ నేతలను పురమాయించారు. చివరికి.. వైఎస్ ను తిట్టిన టీఆర్ఎస్ ను ఓడించాలని.. వైసీపీ వ్యవస్థాపకుడు శివకుమార్ పిలుపునిస్తే.. ఉన్న పళంగా ఆయనను పార్టీ నుంచి బహిష్కరించి తమ ఉద్దేసం ఏమిటో చెప్పకనే చెప్పారు. అయినా ఓ పార్టీకి జాతీయ అధ్యక్షుడు.. చంద్రబాబునాయుడు పార్టీ కోసం ప్రచారం చేసుకోవడం తప్పేముందో జగన్ తెలియాలి.