మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి! ఈసారి కూడా ఆయన టార్గెట్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే! నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ రోడ్ షో నిర్వహించారు. ప్రజలను దారుణంగా వెన్నుపోట్లు పొడుస్తున్నారనీ, దారుణంగా రైతులను మోసం చేశారనీ, ఇంతటి దారుణంగా అక్కచెల్లెమ్మలను మోసం చేస్తున్నారనీ, ఇంతటి దారుణంగా పిల్లల్ని సైతం వదలకుండా చేస్తున్నారని జగన్ తీవ్ర స్వరంతో విమర్శించారు. ఇలాంటి వ్యక్తికి ఏ శిక్ష విధించినా కూడా తప్పేనా అని అడుగుతా ఉన్నా అంటూ ప్రజలను ప్రశ్నించారు. ఆ వెంటనే జావాబు కూడా చెబుతూ.. ఆ శిక్షేంటో చెప్పేశార్లెండి! ఇలాంటి వ్యక్తికి ఉరి శిక్ష విధించినా తప్పు ఉందాని అడుగుతా ఉన్నా అని జగన్ అన్నారు.
సరిగ్గా మూడ్రోజుల కిందట జరిగిన రోడ్ షోలో కూడా ఇలానే చంద్రబాబును ఉరి తీయ్యాలని వ్యాఖ్యానించారు. తప్పుచేసిన నిన్ను నిలదీస్తామనీ, తప్పు చేసిన నిన్ను అడుగుతామనీ, చేసిన అన్యాయాలకూ మోసాలకూ ఏ శిక్ష విధించినా తక్కువేననీ, ఇలాంటి మోసాలు చేసే వ్యక్తికి ఉరి శిక్ష వేసినా కూడా తప్పులేదూ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. కొద్దిరోజుల కిందట గుంటూరులో జరిగిన వైకాపా ప్లీనరీలో జగన్ మాట్లాడుతూ… నడిరోడ్డు మీద కాల్చినా తప్పులేదు అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిజానికి, జగన్ ప్రసంగంలో ముఖ్యమంత్రి మీద ఈ స్థాయిలో అక్కసు వెళ్లగక్కడం అనేది ప్లీనరీ నుంచే ఎక్కువైందని చెప్పొచ్చు. జగన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మంత్రి భూమా అఖిల ప్రియ ఈ మధ్యనే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
జగన్ తాజా వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రాణాలతో ఉండకూడదని జగన్ కోరుకుంటున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సీఎం సీట్లో కూర్చోవాలనే కోరిక బాగా పోరిగిపోయిందనీ, ఎంతసేపూ నేను ముఖ్యమంత్రి అవుతా అవుతా అంటుండటం ఉన్మాదం అవుతుందని ఆయన విమర్శించారు. ఈ తరహా రాజకీయ నాయకుడిని ఎక్కడా చూడలేదన్నారు. చెప్పతో కొట్టాలనీ, ఉరి తీయ్యాలనీ, బంగాళా ఖాతంలో కలపాలని జగన్ మాట్లాడటం సరికాదని ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో జగన్ తల్లితోపాటు ఏడుమంది ఎమ్మెల్యే అభ్యర్థులను విశాఖ ప్రజలు బంగాళాఖాతంలో కలిపారని గుర్తుచేశారు. నంద్యాల ప్రజలు ప్రశాంత్ కిషోర్ కంటే చాలా తెలివైనవారనీ, అభివృద్ధిని కళ్లారా చూస్తున్నారనీ, తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణను జగన్ తట్టుకోలేకనే ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇంతకీ… ఉన్నట్టుండి జగన్ వ్యాఖ్యలలో ఈ స్థాయి పదజాలం ఎందుకొచ్చి చేరుతోందో..? ఇది వ్యూహాత్మక ఆవేశమా.. లేదా, అసంకల్పిత ఆవేశమా..? ఏదేమైనా ఈ ధోరణి మంచిది కాదనే చెప్పాలి. యుద్ధంలో గెలవాలంటే శత్రువుని ఓడించాలని అంటారు. అంతేగానీ, ఓడించడం అంటే ఉరి వేయడమో, కాల్చేయడమో అనే అర్థాలు లేవు కదా! ముఖ్యమంత్రిపై అంశాలవారీగా విమర్శలు చేస్తే ప్రజలు హర్షిస్తారు. ప్రభుత్వం తప్పుల్ని ఎత్తి చూపితే.. ప్రతిపక్ష నేత బాగా పోరాడుతున్నారంటారు. అంతేగానీ, వ్యక్తిగత స్థాయిలో విమర్శలకు దిగితే ప్రజలు ఎలా తీసుకుంటారనేది వైకాపా ఆలోచిస్తోందా..?