పవన్ కల్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా వ్యక్తిగత విమర్శలు చేశారు. దీన్ని మనం అంగీకరించలేం. ఎందుకంటే.. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు మొదలైతే.. ఎక్కడికైనా పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. లీడర్ ఎలా ఉంటే క్యాడర్ కూడా అలా ఉంటారు. ఇది ఇప్పుడు ఇంతటితో ఆగిపోదు. సహజనంగానే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ జగన్ పైన.. వ్యక్తిగతంగా విరుచుకుపడతారు. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు.. పవన్ కల్యాణ్ పై వ్యక్తిగతంగా విరుచుకుపడతారు.
రాజకీయ విమర్శను జగన్ వ్యక్తిగతంగా ఎందుకు తీసుకున్నారు..?
ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం. టీవీలు, పత్రికల్లోనే చర్చించుకునే రోజులు కాదు. ఓ పార్టీని .. ఆ పార్టీ అధినేతను విపరీతంగా అభిమానించే వారున్న ఈ కాలంలో.. సోషల్ మీడియాలో ఎలా అయినా సరే విమర్శించుకోవడానికి వెనుకాడటం లేదు. రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు విధానాలపై విమర్శలు చేసుకోవడం సమాజానికి మేలు చేస్తుంది. పవన్ కల్యాణ్ పై .. జగన్ వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన సందర్భం కూడా లేదు. పవన్ కల్యాణ్ .. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా మాత్రమే విమర్శించారు. తనకు పది, పదిహేను మంది ఎమ్మెల్యేలుంటే… తాను అసెంబ్లీ, పార్లమెంట్ లో ఉండి పోరాడేవాడ్ని కానీ.. జగన్మోహన్ రెడ్డిలా పారిపోయేవాడ్ని కాదని పవన్ విమర్శించారు. ఇది రాజకీయ విమర్శ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న రాజకీయ నిర్ణయంపై పవన్ కల్యాణ్ చేసిన విమర్శ ఇది. పవన్ కల్యాణే కాదు.. చాలా మంది ఇదే రకమైన విమర్శలు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా..ఈ ప్రశ్నపై ఆత్మవిమర్శ కూడా చేసుకున్నామన్నారు కొంత మంది నేతలు.
జగన్ నిర్ణయాల వల్ల ప్రజలకే నష్టం..!
పార్లమెంట్ కు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. అప్పుడే అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చింది. దేశం మొత్తం అవిశ్వాస తీర్మానంపై చర్చను ఆసక్తిగా చూసింది. ఆ సమయంలో లోక్ సభలో తమ వాయిస్ వినిపించుకోవడానికి ఎంపీలు లేని పరిస్థితి వైసీపీకి ఏర్పడింది. పోనీ అసెంబ్లీకి అయినా హాజరై… ప్రజాసమస్యలపైన గళమెత్తుతారా అంటే.. అక్కడ కూడా ఓ రాజకీయ నిర్ణయం కారణంగా బాయ్ కాట్ చేశారు. ఫిరాయంపు ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకునేదాకా అసెంబ్లీకి పోమని సవాల్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై వైసీపీ పోరాడటంలో తప్పు లేదు. కానీ పార్టీ ఫిరాయింపులు చంద్రబాబునాయుడుతో ప్రారంభం కాలేదు.. చంద్రబాబుతో ముగిసిపోవు. రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ ఫిరాయింపులు జరిగాయి. అసలు ఫిరాయింపులను ప్రొత్సహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఫిరాయింపులను ప్రొత్సహిస్తోంది. టీఆర్ఎస్ కూడా అదే పని చేస్తోంది . ఫిరాయింపులను ప్రశ్నించడంలోతప్పు లేదు. కానీ ఈ కారణంతో అసెంబ్లీకి హాజరు కాకూడదనే నిర్ణయం తీసుకోవడం తప్పు. ఈ నిర్ణయం వల్ల ప్రజలకు నష్టం.. ప్రజాస్వామ్యానికి నష్టం. విపక్షం లేని శాసనసభ వల్ల ప్రజలకు నష్టం. వీటితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం.
రాజకీయంగా విమర్శించి ఉంటే సరిపోయేది..!
అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ ఎత్తగడపైన… పవన్ కల్యాణ్ రాజకీయ విమర్శ చేశారు. దీనికి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి స్పందించడంలోతప్పు లేదు. గతంలో జగన్…పవన్ కల్యాణ్ రాజకీయ సినిమాకు ఇంటర్వెల్ ఎక్కువ సినిమా తక్కువ అన్నారు. అది వ్యక్తిగత విమర్శ కాదు. రాజకీయ విమర్శే. పవన్ కల్యాణ్ నిరంతర రాజకీయం చేయడం లేదన్న విషయాన్ని జగన్ చెప్పుకొచ్చారు. అది తప్పు కాదు. అలాంటి రాజకీయ విమర్శ ఇప్పుడు కూడా చేయవచ్చు. ఇప్పుడు అనవసరంగా పవన్ పై జగన్ చేసిన వ్యక్తిగత విమర్శల వల్ల పవన్ మాత్రమే కాదు.. పవన్ కల్యాణ్ జీవిత భాగస్వామిని కూడా.. రాజకీయంలోకి తీసుకొచ్చారు. వారికేం రాజకీయాలతో సంబంధం లేదు. వారిని కూడా రాజకీయ విమర్శల్లోకి తీసకొస్తే..ఇక దానికి అంతు ఉండదు.
ప్రజలపై ప్రభావం చూపేలా ఉంటే వ్యక్తిగతంగా విమర్శించవచ్చు.!
వ్యక్తిగతంగా కూడా ఒక్కోసారి ప్రశ్నించవచ్చు. ఎప్పుడంటే..ఓ రాజకీయ నేత కుటంబం వల్ల కానీ కుటుంబంలోని వ్యక్తుల వల్ల కానీ.. ప్రజాజీవితం ప్రభావితమైనప్పుడు కచ్చితంగా ప్రశ్నించాలి. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అలాగే జనసేన పార్టీపైనా కూడా ఎలాంటి ప్రభావమూ చూపలేదు. అందువల్ల ప్రజల పై ప్రబావం చూపని వ్యక్తిగత జీవితాన్ని… రాజకీయ విమర్శలతో ప్రశ్నించడంలో అర్థం లేదు. ఇలాంటి తీరు మొత్తం ప్రజాస్వామిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల .. కుటుంబాన్ని తీసుకొచ్చి విమర్శలు చేసుకోవచ్చన్న భావన వస్తే…దీనికి అంతు ఉండదు. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా.. రాజకీయ నేతల వ్యక్తిగత జీవితాల్లోని అంశాలను… బయటకు తీసుకువచ్చి విమర్శలు చేయడం మంచిది కాదు. ఇప్పటికైనా.. ప్రజాసమస్యలపై విమర్శించుకోవాలి.. చర్చించుకోవాలి.. అది ప్రజలకు ఉపయోగం.