అంబేద్కర్ జయంతి వేడుకలను అన్ని రాజకీయ పార్టీలు ఈసారి మరింత వైభవంగా జరుపుకున్నాయి. రెండు తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు.. 125 అడుగుల విగ్రహాలతో మైలేజీ సాధించే ప్రయత్నంలో ఉన్న సమయంలో.. ప్రతిపక్షాలు మరింత ఘనంగా అంబేద్కర్ కు నివాళి అర్పించడానికి పోటీ పడడం సహజం. అదే పని ఏపీలోని విపక్షనేత జగన్ కూడా చేశారు. ఈ సందర్భంగా ఎస్సీలకు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని, వంచిస్తున్నదని, మాయ చేస్తున్నదని ఆరోపించడం సహజం. అలాగే జనం ముందు మాట్లాడే అవకాశం వచ్చింది గనుక.. తన పార్టీని వీడి వెళుతున్న వారందరి మీద అక్కసు మరోసారి వెళ్లగక్కడాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కార్యక్రమంలో జగన్ క్రిస్టియానిటీలో చేరిన ఎస్సీ ఎస్టీలకు కుల సర్టిఫికెట్ ఇవ్వడం లేదని, ఇది చాలా దుర్మార్గం అని నిరసించారు.
హిందూత్వంలో ఉన్నంత వరకు ఆ మతంలోని కుల వ్యవస్థ వలన గురవుతున్న అసమానతల్ని దూరం చేసేందుకు వారికి కులపరమైన రిజర్వేషన్లు కల్పించడం, వాటిని పొందడానికి వీలుగా కుల సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. హిందూత్వాన్నే వదలి వెళ్లిపోయిన తర్వాత ఈ కులాల నుంచి కూడా దూరం వెళ్లిపోయినట్లే లెక్క. క్రిస్టియానిటీలోకి వెళ్లిన తర్వాత కూడా ఎస్సీలుగా కుల రిజర్వేషన్లు పొందేలా సర్టిఫికెట్లు కోరుకోవడాన్ని రాజ్యాంగం అనుమతించదు.
అయితే ఈ క్షేత్రస్థాయి వాస్తవాలు జగన్కు తెలుసో లేదో గానీ.. ఆయన క్రిస్టియన్లలో చేరిన ఎస్సీలకు కుల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. ఈ ప్రభుత్వాలు ద్రోహం చేస్తున్నట్లు మాట్లాడారు. జగన్ మరీ ఓటు బ్యాంకు రాజకీయాల మీది ఆలోచనతో ఇలాంటి మతపరమైన విద్వేషాలను, సామాజిక అసమానతల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కరెక్టు కాదని పలువురు అంటున్నారు. ఆయన బాధ్యతగల నాయకుడిగా మాట్లాడాలని సూచిస్తున్నారు.