వైఎస్ జగన్మోహన్ రెడ్డి… ఉప్పు సత్యాగ్రహం చేసిన.. మహాత్మగాంధీతో తనను తాను పోల్చుకుంటున్నారా..? గాంధీ చేసిన పాదయాత్రల్లానే..తన పాదయాత్ర కూడా.. తనను మహాత్ముడి రేంజ్లో నిలబెట్టిందని అనుకుంటున్నారా..? ఆయన పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు.. గాంధీ పాదయాత్రలను.. తమ నేత పాదయాత్రతో పోల్చుకుని పోస్టులు పెట్టేవారు. దానిపై.. సోషల్ మీడియాలో ఇతర పార్టీల వాళ్లు జోకులేసేవాళ్లు. సొంత పార్టీ పెద్దలు .. ఇలా మహాత్ముల్ని ..రాజకీయాలకు వాడుకోవద్దని మందలించి ఉంటారని… అప్పట్లో చాలా మంది అనుకుని ఉంటారు. కానీ.. అలా చేయమని ప్రోత్సహించింది… వాళ్లేననడానికి.. కొన్ని తార్కాణాలు ఇప్పుడు బయట పడుతున్నాయి.
ఓ వైపు.. మహాత్ముడు పాదయాత్ర చేస్తున్న దృశ్యం. మరో వైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న దృశ్యం. మధ్యలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న దృశ్యం. మూడు దృశ్యాలను కలిపి.. ఫోటో షాప్ చేసి.. ఓ అందమైన ఫోటోగా లామినేట్ చేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి… తన ఇంట్లో పెట్టుకున్నారు. అదీ కూడా.. తనను కలిసేందుకు వచ్చే ప్రముఖులతో భేటీ అయ్యే ప్రధానమైన హాల్లో.. విలాసవంతమైన సోఫాల వెనుక.. ప్రస్ఫుటంగా కనిపించేలా పెట్టుకున్నారు. జగన్ ను కలవడానికి వచ్చే ప్రముఖులతో.. నిలబడి ఫోటోలు తీస్తూంటారు. ఆ ఫోటోల్లో.. గాంధీ.. జగన్ ..వైఎస్ కాంబినేషన్ కూడా.. బ్యాక్ గ్రౌండ్లో స్పష్టంగా పడేలా ఫోటోలు బయటకు వస్తున్నాయి. దాంతో. .నెటిజన్లలో చర్చకు కారణం అవుతోంది.
మహాత్ముల్ని సాధారణంగా రాజకీయాలకు ఎవరూ వాడుకోరు. తమను తాము ఆయనతో పోల్చుకునే సాహసం అసలు చేయరు. అలా చేయడం కించ పర్చడమే అవుతుంది. కానీ జగన్ చేస్తున్నారన్న అభిప్రాయం.. ఆ ఫోటోలతో వ్యక్తమవుతోంది. మహాత్ముడికి.. జాతీయ పతానికి బయట అయితే.. వైసీపీ నేతలు వన్ పర్సంట్ కూడా.. గౌరవం ఇవ్వరు. జాతీయ పతాకాన్ని తీసేసి తమ పార్టీరంగులు వేస్తారు. మహాత్ముడి విగ్రహానికి.. తమ పార్టీ రంగు పూసేస్తారు. కానీ.. ఆయనతో పోల్చుకుని.. ఫోటోలు మాత్రం ఇంట్లో పెట్టుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.