వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ చాలాకాలం తర్వాత సాక్షి కాకుండా వేరే మీడియాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్ టివి ఛానల్ లో ఇచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ తో తన మనసులోని అనేక విషయాలు పంచుకున్నారు జగన్. అయితే ఈ ఇంటర్వ్యూ లో భాగంగా పవన్కళ్యాణ్ తో పొత్తు గురించి ప్రశ్న అడగగా దానికి ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు జగన్.
పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని లేకపోతే మరొకసారి నష్టపోయే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన చాలామంది అనుకుంటున్నారు అని విలేఖరి ప్రశ్నించగా , అందుకు సమాధానమిస్తూ జగన్ – చాలామంది ఏమీ అలా అనుకోవట్లేదని , 2014లో లాగానే ఈసారి కూడా ఎవరితో పొత్తు లేకుండా సొంతంగా వెళ్లాలని తాము భావిస్తున్నామని జగన్ చెప్పాడు. అలాగే రాష్ట్రానికి జరిగిన అన్యాయం లో టిడిపి , బిజెపితో పాటు పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామి అని వ్యాఖ్యానించిన జగన్ , నాలుగేళ్లపాటు చంద్రబాబుని సమర్థించి, ఇప్పుడొచ్చి చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడితే ప్రజలు పవన్ కళ్యాణ్ మాటలు ఎలా పట్టించుకోవాలని వ్యాఖ్యానించాడు. అయితే పవన్ కళ్యాణ్ తో పొత్తు ఎట్టి పరిస్థితిలో ఉండదా ? అంటూ పదేపదే విలేకరి ప్రశ్నించగా సమాధానం ఇవ్వడానికి కాస్త ఇబ్బంది పడ్డట్టు కనిపించిన జగన్, రాజకీయాల్లో చీమ సహాయం కూడా అవసరమవుతుందని వ్యాఖ్యానించారు. ఇంటర్వ్యూ చూసినవాళ్లు చీమ వ్యాఖ్య విషయం లో కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు.
అయితే ఈ వీడియో , ఆ వ్యాఖ్య వైరల్ అయ్యేలోపు వైయస్ఆర్సీపీ జాగ్రత్త పడ్డట్టు కనిపిస్తోంది. ఎన్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో పవన్ కళ్యాణ్ పొత్తుపై గురించిన వ్యాఖ్యలతో మాత్రమే కట్ చేసిన వీడియో ఆ తర్వాత డిలీట్ చేశారు. అలాగే జగన్ పూర్తి ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియోలో కూడా పవన్కళ్యాణ్ టాపిక్ మధ్యలో కొద్దిపాటి ” కట్ ” గమనించవచ్చు.