తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మరో పార్టీ జెండా ఎగురని నియోజకవర్గం.. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం. ఎప్పటికప్పుడు అభ్యర్థులు మారుతున్నప్పటికీ.. టీడీపీకే అక్కడి ప్రజలు పట్టం కడుతున్నారు. నందమూరి కుటుంబానికి ఆ సీటు సెంటిమెంట్‌గా మారింది. అందుకే గత ఎన్నికల్లో అక్కడ్నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేసి.. పదిహేను వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు. ఈ సారి కూడా.. ఆయన అక్కడ్నుంచి పోటీ చేయబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారికంగా టిక్కెట్‌ను ఖరారు చేశారు. కొద్ది రోజుల క్రితం…నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి.. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ వారంలోనే ప్రచారం ప్రారంభించబోతున్నారు.
ఇక బాలకృష్ణకు ప్రత్యర్థిని వెతకడంలో జగన్మోహన్ రెడ్డి తడబడుతున్నారు. గత మూడు సార్లు ఓడిపోయిన నవీన్ నిశ్చల్ నాలుగేళ్ల పాటు పార్టీని కనిపెట్టుకుని ఉన్నా… మూడు నెలల క్రితం… పక్కన పెట్టేశారు. ఆయన కన్నీటి పర్యంతమైనా పట్టించుకున్న వారు లేరు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీకి కండువా కప్పి… ఆయననే సమన్వయకర్తగా నియమించారు. కానీ.. ఆయన చురుకుగా లేరని… ఇప్పుడు మరో ఆలోచన చేస్తున్నారు. అబ్దుల్ ఘనీని కూడా.. వైసీపీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. బెంగళూరులో స్థిరపడిన బాగా డబ్బున్న ఓ ముస్లిం మైనార్టీ ప్రముఖుడ్ని సంప్రదించినా.. ఆయన ఆసక్తి ప్రదర్శించలేదు. దాంతో.. మాజీ ఐజీ ఇక్బాల్‌ను తెరమీదకు తీసుకువచ్చారు. ఈయన అభ్యర్థిత్వం ఖరారు అయినట్లు వైసీపీలో చెబుతున్నారు. కానీ ఆయన ఇప్పటి వరకూ హిందూపురం వైపు రాలేదు.
టిక్కెట్ల ఖరారు ప్రక్రియ పూర్తిగా… సామాజికవర్గాల ప్రకారం.. నిర్వహిస్తున్నారు వైసీపీ పెద్దలు. హిందూపురంలో.. మైనార్టీల ఓట్లు అధికంగా ఉంటాయి. ఈ కారణంగా మైనార్టీని నిలబెట్టాలని జగన్ డిసైడయ్యారు. అందుకే నవీన్ నిశ్చల్ ను పక్కన పెట్టారు. కానీ బాలకృష్ణను ఢీకొట్టే సరైన మైనార్టీ అభ్యర్థి మాత్రం… వైసీపీకి దొరకడం లేదు. పోటీ ప్రధానంగా రెండు పార్టీల మధ్యే ఉంటుంది. కాబట్టి… కాంగ్రెస్, జనసేన, బీజేపీ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే.. ఆ పార్టీల తపున కొంత మంది పోటీ చేయడానికి దరఖాస్తులు పెట్టుకున్నారు.