నాది ఇదే రాష్ట్రం.. నా నివాసం ఇక్కడే అంటూ జగన్ ప్రతీ చోటా చేస్తున్న ప్రసంగాలు.. అందరికీ గతంలో ఆయన అమరావతి విషయంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెస్తున్నాయి. మీరు గెలిస్తే అమరావతి మారుస్తారా అని అడిగిన ప్రశ్నలకు జగన్.. విచిత్రంగా నవ్వి.. నేను అమరావతిలో ఇల్లు కట్టుకున్నా… చంద్రబాబుకే ఇల్లులేదు..నేను వస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే ఆయన రుషికొండ తొలిచేసి ఇంకో ఇల్లు కట్టుకుంటున్నారు. అంతేనా.. ఇప్పటికే హైదరాబాద్ లో లోటస్ పాండ్.. బెంగళూరులో యలహంక.. చెన్నైలో తాజాగా మరో ప్యాలెస్ కట్టుకున్నారు. కానీ తన నివాసం ఇక్కడేనని సెంటిమెంట్ పండిస్తున్నారు.
ఇదే విషయాన్ని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు కూడా గుర్తు చేస్తున్నారు. నేను ఇక్కడే ఉంటా అన్న జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా అమరావతి లోనే ఉంటా అన్నారని ఆ తరువాత అధికారంలోకి వచ్చి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకున్నారని అన్నారు. ముందు గతంలొ ఇచ్చిన హామీలు ముందు నిలబెట్టుకోండని జగన్ కు సూచించారు. అంతే కాదు కాపు రిజర్వషన్ల హామీలోనూ జగన్ చెప్పిన తప్పుడు మాటలను.. జీవీఎల్ ఎండగట్టారు. రిజర్వేషన్ల అంశంపై కాపులను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. కాపులకు రిజర్వేషన్లు కేంద్రం ఇవ్వడం లేదని అబద్దాలు చెప్పారని, పార్లమెంటు సాక్షి గా కాపుల రిజర్వేషన్ కరెక్ట్ అని తేలిందన్నారు.
కాపులకు బీజేపీ అండగా ఉందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కేటాయించిన పది శాతం కోటాలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది చెల్లదని జగన్ ప్రభుత్వం తర్వాత రద్దు చేసింది. పార్లమెంట్ ఇటీవల ఆ నిర్ణయం చెల్లుతుందని రిజర్వేషన్లు ఇవ్వవొచ్చని తెలిపింది. దీన్నేగుర్తు చేసి.. జీవీఎల్ ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మొత్తంగా జగన్.. గత ఎన్నికలకు ముందు ఓటర్లకు చెప్పిన మాటలనే అటూ ఇటూ మార్చి చెప్పాలనుకుంటున్నారు. కానీ పాతవన్నీ గుర్తుకొచ్చి ఆయన రివర్స్ లో తీసుకున్న నిర్ణయాలు అందర్నీ భయపెడుతున్నాయి.