ఆంధ్రప్రదేశ్లో మతపరమైన కోణంలో పాలన సాగుతోందంటూ.. విస్తృతంగా వస్తున్న విమర్శలకు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కొద్ది రోజులుగా.. మత పరమైన అంశాలను.. తన నిర్ణయాలకు ముడిపెట్టి… ప్రచారం జరుగుతూండటంపై… మండిపడ్డారు. తనకు సంబంధం లేని అంశాలను పెద్దదిగా చేసి చూపుతున్నారని… ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతానని కాన్ఫిడెన్స్ ప్రకటించారు. దేవుడి దయ, ప్రజల దీవెనలు తనకు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మొదటి నుంచి ప్రజలను, దేవుడిని నమ్మానని… కొందరు నా మతం, కులం గురించి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తనకు ప్రత్యేకంగా మతం లేదని.. తన మతం మానవత్వమని.. జగన్ ప్రకటించుకున్నారు. మాట నిలబెట్టుకోవడాన్ని తన కులంగా చెప్పుకున్నారు.
గుంటూరులో ఆరోగ్యోశ్రీ పథకంలో భాగంగా.. ఆపరేషన్లు చేయించుకున్న వారికి నెలకు రూ. ఐదు వేలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా.. ముఖ్యమంత్రి జగన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల పాలనలో.. తీసుకున్న అనేక నిర్ణయాల్లో… మత పరమైన ఆరోపణలు వచ్చాయి. సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యం తొలగింపు, తెలుగు మీడియంను రద్దు చేసి.. ఇంగ్లిష్ మీడియంను మాత్రమే కొనసాగించడం, ఆలయాల్లో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడం..చర్చిలకు మాత్రమే భద్రత కల్పించాలని ఆదేశించడం.. పాస్టర్లకు జీతాలు, జెరూసలెం యాత్రకు ప్రోత్సాహకం పెంపు.. అలాగే.. తిరుమలలో పదే పదే అన్యమత ప్రచార వివాదం బయటకు రావడం వంటివన్నీ.. ఇందులో ఉన్నాయి.
అన్నీ.. ఓ ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయన్న అభిప్రాయం సామాన్యుల్లో బలపడుతోంది. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన స్పందనను వ్యక్తం చేయడానికి కొత్త పథకం ప్రారంభోత్సవాన్ని ఉపయోగించుకున్నారు. అలాంటి వాటితో తనకేమీ సంబంధం లేకపోయినా… తనకు అంట గడుతున్నారని ప్రకటించారు. ముఖ్యమంత్రి వివరణతో అయినా… అన్య మత వివాదం సద్దు మణుగుతుందో లేదో.. వేచి చూడాలి..!