జగన్మోహన్ రెడ్డి నేడు నెల్లూరులో పర్యటించినపుడు అక్కడి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ యధాప్రకారం తన బద్ధ శత్రువు చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. “నేనెప్పుడూ ప్రజలని, దేవుడినే నమ్ముకొంటాను తప్ప నాయకులని కాదు. ఆ ధైర్యంతోనే నేను, మా అమ్మ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చేసాము. అప్పుడు నుదుటన చెయ్యి పెట్టుకొని తేరిపార చూస్తే రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు కనిపించాయి కానీ సరయిన నేత ఒక్కడు కూడా కనబడలేదు. మళ్ళీ తేరిపార చూస్తే మేమిద్దరమే (జగన్, ఆయన తల్లి విజయలక్ష్మి) కనబడ్డాము. ఆ తరువాత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి నాపై ఎన్ని కుట్రలు పన్నినా, తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించినా మేము భయపడలేదు. ఎందుకంటే మాకు ప్రజల ఆశీసులు, పైనుండి ఆ దేవుడి ఆశీసులు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ధైర్యంగా ముందుకు సాగి, వాళ్ళందరి కళ్ళు బైర్లు కమ్మేలాగ 67 అసెంబ్లీ, 10 లోక్ సభ స్థానాలు గెలుచుకోగలిగాము. రాజకీయాలలో ఉన్న వారికి ముఖ్యంగా రెండు లక్షణాలు కలిగి ఉండాలి. 1. ఉన్నత వ్యక్తిత్వం. 2. విశ్వసనీయత. ఆ రెండూ నాకున్నాయి కనుకనే ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. అవి లేవు కనుకనే చంద్రబాబు నాయుడు ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చి మళ్ళీ హామీలను అమలుచేయకుండా ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారు. ఆయన చేస్తున్న మోసాలను పై నుండి ఆ దేవుడు, క్రిందన ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. త్వరలోనే ఆయన ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే రోజు వస్తుంది. అప్పుడు ఆయనకి డిపాజిట్లు కూడా దక్కవని నేను ఖచ్చితంగా చెప్పగలను,” అని అన్నారు.
ఆనం సోదరులలో ఒకడయిన ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఇదే సభలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరారు. ఆయనని సాదరంగా వైకాపా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని జగన్ చెప్పారు.