రెండు తెలుగు రాష్ట్రాలలో వైకాపా ఉన్నప్పటికీ, తెలంగాణాలో మాత్రం ఎన్నడూ తన ఉనికి చాటుకొనే ప్రయత్నం చేయలేదు. పైగా తమ ముగ్గురు ఎమ్మెల్యేలలో ఇద్దరినీ ఆకర్షించి తీసుకుపోయిన తెరాసకే మే నెలలో జరిగిన శాసనమండలి ఎన్నికలలో వైకాపా మద్దతు ఇచ్చింది. అదే విషయం గురించి తెదేపా నేతలు ప్రశ్నిస్తే “మేము ఎవరికి మద్దతు ఇచ్చుకొంటే మీకెందుకు?” అని జగన్మోహన్ రెడ్డి ఎదురుప్రశ్నించారు. తెరాస-వైకాపాల మధ్య ఉన్న రహస్య అనుబంధం ఉన్న కారణంగానే తెలంగాణాలో వైకాపా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయకుండా, తెరాసకు అవసరమయినప్పుడు పనిచేసే ఒక డమ్మీ రాజకీయ పార్టీగా మిగిలిపోయింది. అందుకే వరంగల్ ఉప ఎన్నికలలో అది పోటీకి దిగినప్పుడు కూడా అందరూ దానిని అనుమానిస్తున్నారు.
అది ఓట్లు చీల్చి తెరాసకు లబ్ది చేకూర్చేందుకే ఎన్నికలలో పోటీకి దిగిందని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. గత 16నెలల్లో ఏనాడూ తెరాస ప్రభుత్వానికి, దాని ముఖ్యమంత్రి కేసీఆర్ కి వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడని వైకాపా నేతలు ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా కేసీఆర్ పై నిప్పులు కురిపిస్తుండటం చూసి రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. నిన్నటి నుండి మొదలుపెట్టిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ పాలనను ఏకిపారేశారు. ఆయన నిరంకుశ వైఖరిని, ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించారు. గత 16నెలల్లో ఏనాడూ అడగని ప్రశ్నలన్నిటినీ నిన్న ఒక్క రోజే అడిగేశారు. జగన్మోహన్ రెడ్డి తమ అధినేత కేసీఆర్ పై నిప్పులు కురిపిస్తున్నప్పటికీ ఇంకా తెరాస నేతలెవరూ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బహుశః నేటి నుండి వారు కూడా జగన్ పై, రాజశేఖర్ రెడ్డి పరిపాలనపై విమర్శలు గుప్పించవచ్చును.
అయితే తెరాస-వైకాపాలు చేస్తున్న ఈ పోరాటాల వలన ఏమవుతుంది? అని ఆలోచిస్తే ముందే అనుకొన్నట్లుగా ప్రజల ఓట్లు చీలిపోతాయని అర్ధం అవుతుంది. తెరాస ఓటు బ్యాంక్ తెరాసకు పదిలంగానే ఉంటుంది. కానీ కాంగ్రెస్, తెదేపా, బీజేపీల ఓటు బ్యాంక్ బ్రద్దలయిపోతుంది. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంత తీవ్రంగా తెరాసను విమర్శిస్తే అంత ఎక్కువగా ఓటర్లలో చీలికలు ఏర్పడుతాయి. తమ ‘ఇంటి పార్టీ’ అయిన తెరాసని, దాని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు ఓటర్లలో ఆంధ్రాకు చెందిన వైకాపా, తెదేపాలపై వ్యతిరేకత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికలలో వైకాపా గెలవాలనే ఉద్దేశ్యంతో పోటీ చేయడం లేదు కనుక దానికి ఓటమి భయం లేదు. తనకి ఒక కన్ను పోయినా పరువాలేదు ఎదుటవాడికి రెండు కళ్ళు పోవాలన్నట్లుగా ఉంది దాని వ్యవహారం. ఈ ఎన్నికలలో తమ పార్టీ విజయం కోసం కాక, తెదేపా మద్దతు ఇస్తున్న బీజేపీ అభ్యర్ధి ఓటమి కోసమే వైకాపా రంగంలో దిగిందని భావించవచ్చును. అందుకోసం అది ‘రివర్స్ క్యాంపెయినింగ్’ పద్దతిలో యుద్ధం చేస్తూ తమ ఉమ్మడి శత్రువు తెదేపాని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోందని భావించవచ్చును.