ఇచ్చాపురంలో అడుగుపెడుతూండగానే.. మనసు పులకరించింది. ఇదే చివరి నియోజకవర్గం. ఏపీకి బోర్డర్ మాత్రమే..కాదు.. నా పాదయాత్రకు ముగింపు కూడా. ఇక్కడితో అయిపోతుంది. తొమ్మిదో తేదీ.. ఓ పెద్ద పండుగ. ఈ లోపు ఒక్క శుక్రవారమే. ఒక్క శుక్రవారం కోర్టులో హాజరు వేయించుకుంటే.. ఇక పాదయాత్ర నుంచి నేరుగా కోర్టుకెళ్లారనే… టీడీపీ నేతల సెటైర్లను భరించాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత శుక్రవారం కోర్టుకు వెళ్లినా.. వెళ్లకపోయినా ఎవరూ పట్టంచుకోరు.
పులివెందుల టు ఇచ్చాపురం… దాదాపుగా 3600 కిలోమీటర్లు. మా నాన్న కూడా ఇంత దూరం నడవలేదు. మా నాన్న కన్నా.. ఎక్కువగా ప్రజలు ఆదరిస్తున్నారు. ఎక్కడిక్కడ… గుంపులు గుంపులుగా జనం వచ్చి సెల్ఫీలు దిగిపోతున్నారు. వీళ్లందరూ ఓట్లు వేస్తారా..అన్న ఆలోచన మనసులో ఉన్నప్పటికీ.. అంత సమయం తీసుకుని సెల్ఫీ ఇచ్చాను కాబట్టి.. ఒక్క ఓటు వేయకుండా ఉంటారా.. అన్న నమ్మకం మనసులో ఉంది.
ఎక్కడ చూసినా ప్రజలు నన్ను చూసి సంతోషంతో నవ్వుతున్నారు కానీ… నాకెందుకో… వారి బాధలు నాకు తెలిస్తే నేను బాధపడతానని.. వారు తమ బాధను.. తమ నవ్వులో దాచుకున్నారేమో అనిపిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రపంచంలో అంతా మోసమే. ముఖ్యంగా.. ఏపీలో అంతా దగా దగా…! . ఏపీలో ఏ ఒక్కరూ కూడా… చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సంతోషంగా లేరు. అప్పట్నుంచి వారు కడుపు నిండా అన్నం కూడా తింటున్నారో లేదోననే అనుమానం ఉంది. చంద్రబాబు తిననివ్వడం లేదు. అది కూడా లాగేసుకుటున్నారు. అందుకే అందరికీ కష్టాలే. వారి కష్టాలు తీర్చడానికే నేను కష్టపడాల్సి వస్తోంది. దేశంలో పధ్నాలుగు, పదిహేను నెలలు నడిచిన రాజకీయ నాయకుడ్ని నేనే. శుక్రవారం తప్ప.. అన్ని రోజులు నడిచిన ఈ కష్టమంతా ప్రజల కోసమే..!
పోవచ్చొచ్చింది.. అయిపోవచ్చింది.. ఇక ఆరు రోజులే మిగిలి ఉంది. మధ్య ఓ శుక్రవారం ఉన్నప్పటికీ… నడక ముగుస్తుంది. ఆ తర్వాత ఎన్నికలొస్తాయి. ఇక నడవాల్సిన అవసరం ఉండదు. ఈ ఏడాదిలోనే రాజకీయం అంతా మారిపోయింది. ” చంద్రబాబు పోవాలె.. జగన్ రావాలే…” ఈ నినాదం నా మనసును ఉరకలెత్తిస్తోంది. నడక ముగించిన తర్వాత కారులోనే.. అధికారానికి దగ్గరగా పోవడం ఖాయమైంది.
పాదయాత్ర.. ఇంకొక్క ఆరు రోజులే..!
——–సుభాష్