పార్టీ నుంచి ఇతర నాయకులు ఎవరైనా వెళ్లిపోవడం వేరే సంగతి.. కానీ తాను ఎంతో ప్రాధాన్యం ఇచ్చిన, సమీప బంధువు కూడా అయిన, తాను గౌరవంగా చూసుకున్న భూమా నాగిరెడ్డి కూడా వెళ్లిపోవడం తనను బాధిస్తున్నదని వైఎస్ జగన్మోహనరెడ్డి ఆయన ఫిరాయింపు సమయంలో తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అవును మరి, సమీప బంధుత్వం ఉన్న నేతలు కూడా, నాయకుడిని నమ్మకుండా పార్టీని వీడి వెళ్లిపోతే ప్రజల్లో ఉండే గౌరవం పలుచన అయిపోతుంది. అయితే అలాంటి షాక్‌లు జగన్‌కు మరిన్ని తప్పేలా కనిపించడం లేదు. ఆయనకు ఇంకా సన్నిహిత బంధువులు అయిన పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తెదేపాలో చేరుతున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది దాదాపు ఖరారైనట్లే. ఆ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు తెదేపాలోకి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్నారు. ఆయన స్వయంగా అనుచరుల సహా లోకేష్‌ను కలిసి అశోక్‌రెడ్డి రాకను అడ్డుకోవడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. పార్టీకోసం ఎవరు వచ్చినా సరే చేర్చేసుకోవడం గ్యారంటీ అని లోకేష్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ముగ్గురు ఎమ్మెల్యేలు వైకాపానుంచి తెదేపాలోకి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే అయిన జగన్‌కు అత్యంత సన్నిహిత బంధువు, ప్రకాశం జిల్లా ముఖ్య నేత కూడా తెదేపాలోకి వెళ్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు విషయంలోనూ జగన్ ఆయనను నెత్తిన పెట్టుకున్నట్టుగా వ్యవహరించారు. అయితే ఎమ్మెల్యేగానే ఓడిపోయిన సదరు నేత.. అప్పటినుంచి పార్టీ కార్యకలాపాల పట్ల విముఖంగా, దూరంగానే ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా పార్టీ మారవచ్చునని అంతా అనుకుంటున్నారు. అదే జరిగితే వైఎస్ జగన్‌కు షాకుల మీద షాకు తగిలినట్లే అవుతుందని అంతా భావిస్తున్నారు.