అంతర్వేది లక్ష్మి నరసింహస్వామి రథం దగ్ధం ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఆ ఘటన కేంద్రంగా రాజకీయం అంతకంతకూ పెరుగుతూండటం.. ఎక్కువ మంది సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూండటంతో.. జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రథం దగ్ధం అవడానికి కారణం ఏమిటో పోలీసులు ఇంత వరకూ గుర్తించలేదు. తేనెతుట్టెను తీసుకోవడానికి అర్థరాత్రి పూట నిప్పు పెట్టారని జగన్ మోహన్ రెడ్డి సొంత మీడియాలో సాక్షిలో చెప్పారు. ఈ కారణం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఆలయంలో సీసీ కెమెరాలు పని చేయకపోవడం… ఘటన జరిగిన తర్వాత అదే పనిగా షార్ట్ సర్క్యూట్ అని.. మతి స్థిమితం లేని వాళ్ల పని అని రకరకాలుగా ప్రచారం చేయడంతో ప్రజల్లో మరిన్ని అనుమానాలు పెరిగిపోయాయి.
హిందూ సంఘాలు ఆందోళలకు దిగాయి. రథం దగ్ధం అయిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రులపై కొంత మంది దాడికి ప్రయత్నించారు. బీజేపీ-జనసేన పార్టీలు ఈ అంశంపై రోజు రోజుకు ఆందోళనలు ప్రారంభించాయి. ముట్టడి కార్యక్రమాల వంటివి చేపట్టాయి. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలంటే… సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడమే మార్గమని సీఎం జగన్ భావించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం రాక ముందు అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. ఆ తర్వాత మీడియాతో ాట్లాడిన బొత్స.. సీబీఐ విచారణ అవసరం ఏముందని ప్రశ్నించారు. కాసేపటికే సీబీఐ విచారణ నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారు. అయితే.. ఇప్పటికే ఏపీలో సీబీఐ కేసులు పెరిగిపోయాయి.
కొన్ని కోర్టులు ఆదేశిస్తూంటే.. మరికొన్ని ప్రభుత్వం సిఫార్సు చేస్తోంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే యరపతినేని, కర్నూలులో ఓ విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసు లాంటి వాటిని ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆయేషా మీరా, వివేకా హత్య కేసులు.. పోలీసుల అక్రమ నిర్బంధాలు, డాక్టర్ సుధాకర్ వంటి అంశాలపై హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రభుత్వం సీబీఐకి సిఫార్సు చేస్తే.. ఎప్పుడు కేసు నమోదు చేస్తారు.. ఎప్పుడు విచారణ చేస్తారు. .. ఎప్పుడు దోషులను పట్టుకుంటారన్నది కాలానికే వదిలేయాల్సి ఉంటుంది.