ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి వరకూ ఈ పోస్టులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. తన వల్ల కాదని ఆయన దండం పెట్టేశాక.. విజయసాయిరెడ్డికి ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఇది విజయసాయిరెడ్డిని గౌరవించడంమా అవమానించడమా అన్న దానిపై చాలా సందేహాలు ఉన్నాయి. గత ఎన్నికలకు ముందు పార్టీలో చక్రం తిప్పిన ఆయన ఇప్పుడూ ఎటూ కాకుండా పోయారు. అసలు కనిపించడమే మానేశారు. ఢిల్లీలో ఆజ్ఞాత వాసం గడుపుతున్నారు. ఆయనను పూర్తిగా పక్కన పెట్టేశారని ప్రచారం జరుగుతున్నా హైకమాండ్ పట్టించుకోలేదు. అయితే బాలినేని స్థానంలో ఆయనను నియమించారు.
నిజానికి ఆ మూడు జిల్లాల కోఆర్డినెటర్ గా నియమితులుకావడం అంటే.. మూడు జిల్లాల పెత్తనం ఆయనకు రాదు. అన్ని జిల్లాల్లోనూ చక్రం తిప్పే నేతలు ఉన్నారు. ప్రకాశం జిల్లాలో వైవీ సుబ్బారెడ్డితో పొసగకనే బాలినేని దూరమయ్యారు. విజయసాయిరెడ్డికి, సుబ్బారెడ్డికి మధ్య కూడా గ్యాప్ ఉంది. ప్రకాశం జిల్లా రాజకీయాలు మొత్తం తన కనుసన్నల్లో ఉండాలని వైవీ సుబ్బారెడ్డి కోరుకుంటారు. ఇక చిత్తూరు జిల్లాకు వస్తే.. పెద్దిరెడ్డి కనుసైగతోనే వైసీపీ నడుస్తోంది. వేరే వారు వేలు పెట్టడానికి లేదు. ఇక నెల్లూరు జిల్లా ఇప్పటికే అస్తవ్యస్తమయిపోయింది. అక్కడ ఎవరిని సమన్వయం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఉంది.
అందుకే ఈ మూడు జిల్లాల కో ఆర్డినేటర్ పదవి అంటే ఎందుకూ పనికి రానిదన్న అభిప్రాయం ఉంది. అధికారం దక్కడంలో కీలక పాత్ర పోషించిన తనను ఇలా స్పేర్ గా వాడుకోవడంపై విజయసాయిరెడ్డి స్పందన ఎలా ఉందో వైసీపీ వర్గాలకు అంతుబట్టడం లేదు. తనను రీజినల్ కోఆర్డినేటర్ గా నియమించినట్లుగా మీడియాకు వైసీపీ పెద్దలు లీకులు ఇచ్చినా ఆయన మాత్రం ఇంకా సోషల్ మీడియాలో ఎవరికీ కృతజ్ఞతలు చెప్పలేదు.