ఆంధ్రప్రదేశ్ ప్రజలకు టీకా ఫెస్టివల్ నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. నాలుగు వారాల్లో కోటి టీకాలను ప్రజలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కోటి టీకాలు పట్టణ ప్రాంత ప్రజలకే వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ కారణంగా కోవిడ్ వ్యాక్సినేషన్‌కు అడ్డంకి అవుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయంతో ఉన్నారు. అయితే కరోనా ఉద్ధృతి పెరుగుతున్న సమయంలో… కేంద్రం నుంచి వ్యాక్సినేషన్ మరింత వేగంగా చేయాలన్న ఒత్తిడి వస్తూండటంతో నగర ప్రాంతాల్లో ముందుగా పూర్తి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు.
సోమవారం నుంచే అర్బన్ ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయడం ప్రారంభిస్తారు. ఇప్పటి వరకూ కేంద్రం వైద్య ఆరోగ్య సిబ్బందికి .. కరోనా వారియర్స్‌కి… వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వాలని రాష్ట్రాలను నిర్దేశించింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే సీఎం జగన్ ముందుగానే ఆ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. సోమవారమే అంటే.. ఏప్రిల్ ఒకటికి నాలుగు రోజుల ముందే వ్యాక్సినేషన్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొత్తం.. కోవిన్ యాప్ ద్వారా సాగుతుంది. అక్కడ నమోదు చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారు.
కోవిన్ యాప్‌లో నలభై ఐదేళ్లకు పైబడినవారు నమోదు చేసుకోవాలంటే.. ఒకటో తేదీ వరకూ ఆగాలి. మామూలుగా అరవై ఏళ్లు పైబడిన వారికి ఇప్పుడు వ్యాక్సిన్ ఇస్తున్నారు. కొత్తగా ఎవరికి ఇస్తారనేది కొంత సందేహం ఉంది. ఏపీలో ఎక్కువగా వ్యాక్సిన్ వృధా అవుతోందని ప్రధాని మోడీ.. ఇటీవల జరిగిన సమీక్షలో అసంతృప్తి వ్యక్తం చేశారు. జీరో వేస్టేజీ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్‌కు ఏపీ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అయితే గతంలో ప్రజలందరికీ మూడేసి మాస్కులు పంపిణీ చేస్తామని జగన్ ప్రకటించారు. కానీ పంపిణీ చేయలేదు. అందుకే.. ఇలాంటి భారీ ప్రకటనలు ప్రభుత్వం వైపు నుంచి వచ్చినప్పుడు… విపక్షాలు అమలుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటాయి.