ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనూహ్యంగా వాయిదా పడింది. ఆయన కలవాలనుకున్న హోంమంత్రి అమిత్ షా బిజీగా ఉండటం వల్ల.. అపాయింట్మెంట్ కుదరదలేదని.. అందుకే… ఢిల్లీ పర్యటన వాయిదా పడిందని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గుజరాత్, మహారాష్ట్రకు తుపాను ముప్పు పొంచి ఉన్నందున దాన్ని ఎదుర్కొనే విషయాల్లో .. హోంమంత్రి తీరిక లేకుండా తుపాను తీవ్రత తగ్గిపోయిన తర్వాత మళ్లీ అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పినట్లుగా ప్రభుతవ వర్గాలు చెబుతున్నాయి. కానీ అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారయింది.. రాత్రి పది గంటలకు. అది ఆయనకు తీరిక సమయమే. అయినప్పటికీ.. అపాయింట్మెంట్ రద్దు కావడం వైసీపీ వర్గాల్లోనే ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.
గతంలో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన తర్వాత అపాయింట్మెంట్ ఖరారు కోసం.. రోజుల తరబడి ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఢిల్లీ వరకూ వెళ్లకుండానే… అపాయింట్మెంట్ రద్దు సమాచారం అందడంతో కాస్త రిలీఫ్ దొరికినట్లయింది. గతంలో ఢిల్లీకి వెళ్లి అమిత్ షా… కోసం.. రెండు రోజుల పాటు ఎదురు చూసిన సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ కూడా.. ఇలా ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఖరారు కాని సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నట్లుగా షెడ్యూల్ ప్రకటించిన తర్వాత చివరి క్షణంలో.. అమిత్ షాను కలిసే అవకాశం లేదని తేలడంతో.. పర్యటన రద్దు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వ్యవహారాలను చక్క బెడుతున్నవారు.. వ్యూహాత్మకంగా వ్యవహరించడం లేదని.. తొందరపడి.. టూర్లను ఖరారు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రతీసారి ఢిల్లీ పెద్దల అపాయింట్మెంట్లు రద్దు కావడం.. వైసీపీ నేతలకు కూడా ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యమంత్రి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని చెబుతున్నారు. నిన్నామొన్నటిదాకా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న విజయసాయిరెడ్డి కోఆర్డినేట్ చేసేవారు. ఈ సారి ఆయన ప్రమేయం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి… అపాయింట్మెంట్ తీసుకున్నా… అదే పరిస్థితి ఏర్పడిందన్న చర్చ జరుగుతోంది.
కేంద్ర హోంమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వాలి అనుకుంటే.. పెద్ద విషయం కాదని.. రోజూఆయనను అనేక మంది కలుస్తూ ఉంటారని… కొంత మంది గుర్తు చేస్తున్నారు. ఇలా వరుసగా జగన్కు అమిత్ షా అపాయింట్మెంట్ల రద్దు వెనుక రాజకీయ కారణాలు కూడా ఉంటాయని చెబుతున్నారు. పదే పదే ఇలా జరగడం.. వైసీపీ నేతల్ని కూడా అసహనానికి గురి చేస్తోంది. ఖచ్చితంగా అపాయింట్్మెంట్ ఖరారైన తర్వాత అధికారిక ప్రకటన చేస్తున్నామని.. అయితే.. ఆ తర్వాత రద్దు చేస్తున్నారని.. ఇది ఇబ్బందికరంగా మారుతోందని వారంటున్నారు.