గత నాలుగు రోజుల నుంచి ఎలాగైనా ఢిల్లీ వెళ్లాలని పట్టదలగా ఉన్న సీఎం జగన్ …ఎలాగోలా షెడ్యూల్ ఖరారు చేసుకుని విమానం ఎక్కితే.. మళ్లీ వెనక్కి రావాల్సి వచ్చింది. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి గాల్లోకి లేచిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం వెనక్కి తిరిగి వచ్చింది. గన్నవరం విమానాశ్రయంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. తర్వాత జగన్ వెంటనే తాడేపల్లికి వెళ్లిపోయారు. మరో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
మంగళవారం ఉదయం జగన్ ఢిల్లీ వెళ్తారని వైసీపీ వర్గాలు మీడియాకు చెబుతున్నాయి. కానీ అధికారిక సమాచారం మాత్రం లేదు. కేంద్ర ప్రభుత్వ పెద్దల అపాయింట్ మెంట్లను కూడా సీఎం జగన్ అడిగారని .. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా జగన్ భేటీ అవ్వాలనుకున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే వారి అపాయింట్మెంట్లపై క్లారిటీ లేదు. ఇటీవల మారిపోతున్న రాజకీయ పరిస్థితులు… వివేకా కేసులో సీబీఐ దూకుడు వంటివి చూసుకుంటే.. ఆయన ఢిల్లీ టూర్ తప్పనిసరనిచెబుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో ప్యాసింజర్ విమానాల్లో పర్యటించడం లేదు. ప్రత్యేక విమానాల్లోనే వెళ్తున్నారు. విదేశాలకు వెళ్లినా ప్రత్యేక విమానానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. జగన్ ఢిల్లీ పర్యటనల కోసం ఓ ప్రత్యేక విమానం ఎప్పుడూ గన్నవరం ఎయిర్ పోర్టులో రెడీగా ఉంటుందని చెబుతారు. ఒకే సంస్థ ఈ విమానాలను ప్రభుత్వానికి అద్దెకు ఇస్తుంది. అయితే ముఖ్యమంత్రి లాంటి వీఐపీకి విమానాన్ని రెడీ చేసినప్పుడు.. ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. గాల్లోకి ఎగిరిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తడం అంటే చిన్న విషయం కాదని చెబుతున్నారు. ఆ సాంకేతిక లోపం ఎలాంటిది.. ఎందుకు వెంటని సరి చేయలేకపోయారు అన్నదానిపై ఎలాంటి ప్రకటనా రాలేదు.