ప్రధానితో భేటీ ముగిసిన వెంటనే అమిత్ షాతో అపాయింట్మెంట్ ఉందని హడావుడి పడినప్పటికీ రెండు రోజుల పర్యటనలో అమిత్ షాతో కలిసే అవకాశం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లభించలేదు. ఆయన కేంద్ర హోంమంత్రిని కలవకుండానే వెనుదిరిగారు. ప్రధానమంత్రికి ఎంత చెప్పుకున్నా.. అమిత్ షాకు ఓ మాట చెప్పుకోకపోతే విజ్ఞాపనలకు విలువ ఉండదు. ఈ క్రమంలో ఆయన అపాయింట్మెంట్ కోసం వైసీపీ ముఖ్య నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మొదట సోమవారం రాత్రి తొమ్మిదిన్నరకు అపాయింట్మెంట్ ఖరారయిందన్నారు.
కానీ షా బిజీగా ఉండటంతో తర్వాతిరోజు ఉదయానికి అంటే.. మంగళవారం ఉదయానికి వాయిదా పడిందన్నారు. కానీ మంగళవారం కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. దీంతో జగన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్‌తో భేటీ అయి వెనుదిరిగారు. గతంలో కుదిరితే మోడీ , అమిత్ షాలతో భేటీ అయ్యేందుకు ప్రయత్నించేవారు.. ఇతర మంత్రులతో భేటీకి ఆసక్తి చూపేవారు కాదు. ఈ సారి పలువురు కేంద్రమంత్రుల్ని జగన్ తీరికగా కలిశారు.
ప్రత్యేకంగా ఏదైనా పని మీద వినతులు ఇచ్చారమో స్పష్టత లేదు అలాగే … ఏమైనా హామీలు వచ్చాయా లేదా అన్నదానిపైనా క్లారిటీ లేదు. వైసీపీ క్యాంప్ కూడా సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై మరీ హైప్ క్రియేట్ చేయడం లేదు. పెద్దగా సానుకూల ఫలితాలేమీ కనిపించనందున వీలైనంత వరకూ డౌన్ ప్లే చేసేందుకు వైసీపీ అనుకూల మీడియా కూడా ప్రయత్నించింది. సీఎం ఢిల్లీ పర్యటన దేని కోసం.. దాని ఉపయోగాలు.. నష్టాలు ఏమిటన్నది వచ్చే వారం పది రోజుల పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.