ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ఖరారు చేశారు. శుక్రవారం ఉదయం జగన్ రెడ్డి.. ఢిల్లీలో ప్రధానితో భేటీ కానున్నారు. అపాయింట్ మెంట్ కోసం అత్యంత ఉన్నత స్థాయిలో చేసిన ప్రయత్నాలు ఫలించడంతో ఆయన ఢిల్లీ బాట పడుతున్నారు. ఈ రాత్రికే ఆయన ఢిల్లీ చేరుకుంటారు. తుగ్లక్ రోడ్ లోని తన నివాసంలో బస చేస్తారు. ఈ రాత్రికి కొన్ని అంతర్గత సమావేశాలు పూర్తి చేస్తారని అంటున్నారు. ఆ సమావేశాల చర్చల ఫలితాలను బట్టి ప్రధానమంత్రితో భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
రాష్ట్రం కోసం అని ఎప్పట్లాగే చెప్పే అవకాశం ఉంది కానీ.. మోదీతో భేటీ పూర్తి స్థాయిలో రాజకీయ భేటీ అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ, జనసేన కూటమితో కలిసేందుకు బీజేపీ రెడీ అయింది. ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు చర్చలు తుది దశకు చేరుకున్నాయి. చంద్రబాబు ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ క్రమంంలో ఎన్డీఏలో టీడీపీ చేరికను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అదే జరిగితే .. ఏపీలో తమకు అనుకూలంగా పని చేసే అధికారులు కూడా జగన్ రెడ్డికి హ్యాండిస్తారు. ఎన్నికల సంఘం అక్రమాలను చూస్తూ ఊరుకునే అవకాశం ఉండదు. అందుకే కనీసం బీజేపీ అయినా తమకు పరోక్షంగా సపోర్ట్ ఉండేలా చూసుకునేందుకు టీడీపీతో కలవకుండా ఉండేందుకు జగన్ రెడ్డి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రధాని మోదీకి తనపై ప్రత్యేక అభిమానం ఉందని జగన నమ్మకం. అందుకే తన నిర్ణయాలను సమర్థిస్తూ వచ్చారని అనుకుంటున్నారు. ఇప్పుడు మోదీ కూడా తనను నమ్ముతారని..టీడీపీ ని ఎన్డీఏలో చేర్చుకోరని నమ్మకంతో ఉన్నారు. ఎన్నికల తర్వాత ఎలాగూ తన మద్దతు బీజేపీకే ఉంటుందని ఆయన చెబుతారు.