ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టే ఆలోచన చేస్తున్నారు. ఈ సారి ఆయన రాష్ట్రపతిని కలవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోసారి ప్రధానమంత్రిని కూడా కలిసేందుకు అపాయింట్మెంట్ అడినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు .. చీఫ్ జస్టిస్ కావాల్సిన మరో న్యాయమూర్తిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ లేఖ రాయడమే కాదు.. ఆ లేఖను ప్రత్యేకంగా ప్రభుత్వ సలహాదారుతో మీడియా ముందు చెప్పించి.. మీడియాకు పంచి..అనుకూలమైన జాతీయమీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించడం ఢిల్లీ వర్గాల్లో కూడా సంచలనం సృష్టిస్తోంది. తీవ్రమైన అభియోగాలు ఉన్న నిందితుడు న్యాయవ్యవస్థపై దాడి చేస్తున్నారన్న అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ ఏర్పడుతోంది.
అయితే తన వాదనను జగన్ మరింత బలంగా వినిపించాలని నిర్ణయించుకున్నారు. అందుకే రాష్ట్రపతిని.. మరోసారి ప్రధానిని కలవాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సీజేఐకి రాసిన లేఖను.. రాష్ట్రపతికి ఇచ్చి… రమణను.. న్యాయమూర్తి పదవి నుంచి తొలగించాలని కోరతారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశంపై ప్రధానితోనూ మరోసారి సమావేశం అవ్వాలని జగన్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్మెంట్లను బట్టి.. జగన్ ఏ క్షణమైనా మరోసారి ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీ పెద్దలు ఢిల్లీలో జగన్ రాసిన లేఖను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
అనుకూలంగా ఎవరు మాట్లాడితే వారితో.. మీడియాలో ఇంటర్యూలు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే…న్యాయవ్యవస్థపై విమర్శలు చేయడం… సబ్ జ్యూడిస్ అవుతుంది కాబట్టి.. చాలా మంది ఆలోచిస్తున్నారు. కొంత మంది మాత్రం.. ముందుకు వస్తున్నారు. అలా ముందుకు వచ్చేవారితో జస్టిస్ రమణపై విమర్శలు చేయిస్తున్నారు. మరోసారి జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత న్యాయవ్యవస్థపై ఆయన యుద్ధం మరో రేంజ్‌కి చేరే అవకాశం ఉంది.