ఏపీ రాజధానిలో భూ దందాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ పదే పదే డిమాండ్ చేస్తున్నారు. వ్యూహాత్మక తప్పిదాలు చేస్తే ఎంత దారుణంగా నష్టపోవాల్సి వస్తుందనే అనుభవం లేకపోవడమే దీనికి కారణం కావచ్చు. సీబీఐ విచారణ కోసం అంతగా పట్టుబట్టడానికి కారణం ఆ సంస్థ చేసే దర్యాప్తుపై గట్టి నమ్మకమా?
ఇదే ప్రశ్న వేసి టీడీపీ వారు గట్టిగా నిలదీస్తే జగన్ జవాబు తడుముకోవాల్సి ఉంటుంది. సీబీఐ మీద అంత అపారమైన గౌరవమే జగన్ కు ఉంటే, ఆ సంస్థ అధికారులు ఆయన్ని గతంలో అరెస్టు చేయడం సబబే కదా అని టీడీపీ వారు ప్రశ్నస్తే? అవును కరెక్టే అని జగన్ ఒప్పుకుంటారా? ఇదే పాయింట్ మీద టీడీపీ వారు ఆయన్ని ఇరుకున పెట్టడానికి స్కెచ్ వేసి ఓ ఆట ఆడుకోవడానికి సిద్ధపడితే సీన్ మరోలా ఉంటుంది.
సీబీఐ అరెస్టు చేసిన తర్వాత బెయిల్ కోసం జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ప్రముఖ లాయర్లను పెట్టుకున్నారు. వారు తమ అనుభవాన్నంతా ఉపయోగించి వాదించారు. చివరకు జగన్ కు బెయిల్ వచ్చింది. సీబీఐ తనను అరెస్టు చేయడం అన్యాయం అనే మౌలికాంశం మీదే ఆయన బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. తాను నిర్దోషినే అని లాయర్ల ద్వారా వాదించారు. అలాంటి సీబీఐకి కేసు అప్పగించాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారని టీడీపీ అడిగితే జవాబు చెప్పడం కష్టమే.
ఒకవేళ సీబీఐ తనను తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేసిందని జగన్ గనక టీడీపీ వారికి జవాబు చెప్తే మరో తిరకాసు ఎదురవుతుంది. మరి అలాంటి సంస్థకు కేసును అప్పగించాలని ఎందుకు అడుగుతున్నావని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తారు. అప్పుడు జవాబు కోసం తడుముకోవాల్సి ఉంటుంది. అయినా, సీబీఐకి కేసు అప్పగించినా వచ్చే ఎన్నికల నాటికైనా దర్యాప్తు పూర్తవుతుందా? జగన్ మీద కేసే ఏళ్లకేళ్లుగా నడుస్తోంది. సీబీఐ అన్ని కోణాల్లో దర్యప్తుచేసి, కోర్టుకు సమగ్రంగా చార్జి షీట్ దాఖలు చేయడానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి ఈ డిమాండ్ వల్ల సాధించేది ఏమీ కనిపించడం లేదు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టబోయి తానే ఇరుక్కునే పరిస్థితి తెచ్చుకుంటున్నట్టు కనిపిస్తోంది.