ఆంద్రప్రదేశ్ శాసనసభ సమావేశాలలో చివరి రోజయిన ఈరోజు 11/22 పై అంటే ఓటుకి నోటు, జగన్ చార్జ్ షీట్లపై రసవత్తరమయిన చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఓటుకి నోటు కేసు ఏసిబి అధికారులు దాఖలు చేసిన చార్జ్ షీట్లో చంద్రబాబు నాయుడు పేరు 21సార్లు ప్రస్తావించారని చెప్పడం మొదలుపెట్టగానే తెదేపా సభ్యులు యధావిధిగా జగన్ పై ఉన్న 11 చార్జ్ షీట్ల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ ఈసారి తెదేపా వైకాపాకి అడ్డంగా దొరికిపోయింది. ఓటుకి నోటు కేసులో ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడిన మాట వాస్తవమా కాదా? రేవంత్ రెడ్డిని స్టీఫెన్ సన్ దగ్గరకి చంద్రబాబు నాయుడు పంపడం వాస్తవమా కాదా? అతనికి రూ. 50 లక్షలు ముట్టజెప్పడం వాస్తవమా కాదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడు నిజంగా తప్పు చేయకపోయుంటే సభలోనే ఉన్నప్పటికీ తను అడుగుతున్న ప్రశ్నలకి ఎందుకు సమాధానం చెప్పడం లేదు? దీనిపై సభలో ఎందుకు చర్చ జరగనివ్వడం లేదు? అని నిలదీశారు. ఆ ప్రశ్నలకి తెదేపా నుండి అరుపులు కేకలే సమాధానాలుగా వినిపించాయి.
అప్పుడు స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు కలుగజేసుకొంటూ కోర్టులో ఉన్న ఆ కేసు గురించి సభలో మాట్లాడవద్దని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. అది జగన్ కి మళ్ళీ మరో అవకాశం కల్పించినట్లయింది. కాంగ్రెస్, తెదేపాలు కలిసి తనపై కుట్రపూరితంగా పెట్టించిన కేసులు కూడా కోర్టులోనే ఉన్నప్పుడు అధికార పార్టీ సభ్యులు వాటి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేందుకు అనుమతిస్తూ, ఓటుకి నోటు కేసు గురించి ఎందుకు మాట్లడనీయడం లేదు? అని జగన్ నిలదీశారు. శాసనసభలో అధికార పార్టీకొక రూలు తమకొక రూలా? అని ప్రశ్నించారు. వైకాపా ఎమ్మెల్యే రోజా తదితరులు కూడా ఇదే విషయాన్ని శాసనసభ బయట మీడియా ముందు ప్రస్తావించి, అధికార పార్టీ సభ్యులు మందబలంతో తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వారి వాదోపవాదాల వలన రాష్ట్రానికి, ప్రజలకు ఒరిగేదేమీ లేదు. కానీ ఈ రోజు శాసనసభలో తెదేపాపై వైకాపా పై చెయ్యి సాధించిందని చెప్పవచ్చును.