ఇటీవల జగన్ తూర్పుగోదావరి జిల్లా పాదయాత్ర సందర్భంగా కాపు రిజర్వేషన్లు తాను ఇవ్వలేనని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాపు రిజర్వేషన్లు తాను ఇవ్వలేనని అయితే కాపు కార్పొరేషన్ కు చంద్రబాబు ఇస్తున్న 5వేల కోట్ల స్థానంలో పదివేల కోట్లు ఇస్తానని జగన్ వ్యాఖ్యానించడం ఆతర్వాత ముద్రగడ పద్మనాభం సహా ఇతర కాపు నేతలు జగన్ వైఖరి పై తీవ్రంగా మండిపడ్డ పడటం ఆ తర్వాత జగన్ పాదయాత్ర అడ్డగించడానికి కాపు యువత ప్రయత్నించడం దీంతో పాదయాత్రలో కాస్త ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో జగన్ మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు కాపు రిజర్వేషన్లకు తాను వ్యతిరేకం కాదని కేవలం ఎల్లో మీడియా తన వ్యాఖ్యలను వక్రీకరించారని ప్రకటించాడు. అయితే నిజంగా మీడియా జగన్ వ్యాఖ్యలను వక్రీకరించిందా అన్నది చూద్దాం.
మొన్న ఏమన్నాడు:
నేను ఏదైనా మాటిస్తే ఆ మాటమీద నేను నిలబడతా. చేయగలిగింది మాత్రమే నేను చెబుతాను చేయలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని ప్రతి కాపు సోదరుడికి చెబుతున్నా. కొన్ని రాష్ట్రప్రభుత్వం పరిధిలో ఉండే అంశాలు ఉంటాయి కొన్ని రాష్ట్ర పరిధిలో లేని అంశాలు ఉంటాయి అటువంటిదే ఈ రిజర్వేషన్ల సమస్య. ఈ రిజర్వేషన్ లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలు కాబట్టి వీటిమీద నేను చేయగలిగిన అంశమేమీ కాదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్తాను.
ఇప్పుడు ఏమంటున్నాడు:
వక్రీకరిస్తున్న ఈ పెద్దలందరికీ చెప్తూ ఉన్నాను కాపుల రిజర్వేషన్ విషయంలో మా వైఖరి ఎప్పుడూ ఒకటేనని చెప్తున్నాను యూటర్న్ తీసుకునే అలవాటు మా ఇంటా వంటా లేదు అని చెబుతున్నాను. నేను మొదటినుంచి చెబుతూ ఉన్నది ఒకటే, బీసీలకు అన్యాయం చేయకుండా బీసీల హక్కులను పూర్తిగా కాపాడుతూ కాపుల రిజర్వేషన్ లకు మేము మద్దతే అని మొదటినుంచి చెబుతున్నాను
కాబట్టి ఈ 2 వ్యాఖ్యలు చూసినట్టయితే మొన్న “ఏమాత్రం మొహమాటం లేకుండా రిజర్వేషన్లు ఇవ్వలేను అని చెప్పగలను” అని చెప్పిన జగన్ ఇప్పుడు “బీసీలకు అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్లకు మద్దతు అని చెబుతున్నాడు.” ఇక్కడ యూటర్న్ తీసుకున్న విషయం స్పష్టమే. అయితే ఇలాంటి యు టర్న్ లు రాజకీయాల్లో సహజమే.
పరిణితి చెందిన నాయకుడు, శభాష్ జగన్ అన్న వాళ్ళు ఇప్పుడేమంటారు
అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొన్న కాపు రిజర్వేషన్లు ఇవ్వను అని జగన్ చెప్పగానే జగన్ అనుకూల మీడియాలోనూ జగన్ అనుకూల సోషల్ మీడియా గ్రూప్ ల లోనూ, జగన్ చాలా పరిణతి చెందిన నాయకుడిలా వ్యవహరించాడని శభాష్ జగన్ అని కథనాలు రాశారు. ఇవ్వలేనిది ఇవ్వలేను అని చెప్పడం జగన్ విశ్వసనీయతను ఎంతో పెంచిందని, అర్థం చేసుకోగలిగిన ప్రజలు దీనిని అర్థం చేసుకుంటున్నారు అని, ఇంకా చెప్పాలంటే ఇది జగన్ ఇచ్చిన “మాస్టర్ స్ట్రోక్” అని జగన్ అనుకూల వెబ్ మీడియా, జగన్ అనుకూల యూట్యూబ్ ఛానల్ లో తెగ రాసేశారు. అయితే అలా రాసిన వాళ్ళందరికీ గొంతులో ఇప్పుడు పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ముందు చెప్పిన వ్యాఖ్యలకు ఇప్పుడు పూర్తిగా విభిన్నమైన వ్యాఖ్యలుచేశారు జగన్ . బీసీలకు అన్యాయం జరగకుండా కాపు రిజర్వేషన్లు అన్నది అన్ని పార్టీల స్టాండ్ గా ఉంది. రిజర్వేషన్లు కోరుతున్న ముద్రగడ సైతం బీసీలకు అన్యాయం జరగకుండా రిజర్వేషన్లు ఇవ్వాలనే కోరుతున్నారు. కాబట్టి మిగతా అందరూ ఏ స్టాండ్ అయితే తీసుకుని ఉన్నారో ఇప్పుడు జగన్ అదే స్టాండ్ తీసుకున్నారు.
ఏది ఏమైనా, జగన్ మొన్న రిజర్వేషన్లు ఇవ్వలేను అని చెప్పగానే ఇది చాలా గొప్ప నిర్ణయమని, మాస్టర్ స్ట్రోక్ అని, పరిణితి చెందిన నాయకుడి తీరు అని, ధైర్యంగా వైఖరి ప్రకటించారు అని, శభాష్ జగన్ అని, కథనాలు వ్రాసిన వాళ్ళకి ఇప్పుడు జగనే కాపు రిజర్వేషన్లకి మద్దతు అని చెప్పడం తో మొన్నటి వ్యాఖ్యలు మాస్టర్ స్ట్రోక్ కాదు, సెల్ఫ్-గోల్ అని అర్థమై ఉండాలి.