పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై తాడోపేడో తేల్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను వచ్చే మంగళవారం వరకు పొడిగించారు. మామూలుగా అయితే.. ప్రత్యేక సమావేశాలను మూడు రోజులు మాత్రమే జరుగుతాయని ముందుగా ప్రకటించారు. ఆ మూడు రోజులు నిన్నటితో అయిపోయాయి. కానీ తమ ప్రయత్నానికి మండలిలో అడ్డుకట్ట పడటం.. బిల్లు అటూ ఇటూ కాకుండా.. సెలక్ట్ కమిటీకి పోవడంతో.. దాన్ని ఎలాగైనా తెచ్చి.. చట్ట రూపంలోకి తేవాలన్న పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఉదయం నుంచి ఆయన న్యాయనిపుణులు, మంత్రులు, సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
శాసనమండలి పరిణామాలపై అసెంబ్లీలో చర్చించాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మండలిని ప్రోరోగ్ చేసి.. ఆర్డినెన్స్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పటికీ.. బిల్లు సెలక్ట్ కమిటీలో ఉండగా.. అది సాధ్యం కాదన్న భావన న్యాయనిపుణులు వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ స్పీకర్ అధికారాలనే ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. శాసన మండలి నిర్ణయాన్ని శాసనసభ తిరస్కరించాలని.. అసెంబ్లీ స్పీకర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి .. బిల్లును.. మళ్లీ మండలికి పంపవచ్చని.. మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లుపై అభిప్రాయం చెప్పాలని అడగాలని వైసీపీ హైకమాండ్‌కు కొంత మంది నేతలు అగ్రనేతలు సూచించినట్లుగా తెలుస్తోంది. మిగతా వాటితో పోలిస్తే.. ఇదే కాస్త సులువుగా ఉందని.. ప్రభుత్వం భావిస్తోంది.
అయితే.. శానసమండలిని ఆదేశించే విచక్షాధికారం స్పీకర్‌కు ఎక్కడి నుంచి వస్తుందనేది.. చాలా మందికి అర్థం కాని విషయం. స్పీకర్ అసెంబ్లీకి మాత్రమే స్పీకర్ . ఆయన విచక్షణాధికారాలన్నీ అంత వరకే.. మండలిని ఆదేశించడానికి ఆ విచక్షణాధికారాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ప్రభుత్వం మాత్రం.. ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయంతోనే ఉంది. ఏం చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.