అమరావతి భూముల్ని వేలం వేయడమే కాదు ఇప్పుడు అక్కడ కట్టిన భవనాలను కూడా అద్దెకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీఆర్డీఏ ప్రతిపాదించింది. సీఎం జగన్ ఆమోదించేశారు. అమరావతిలో చంద్రబాబు హయాంలో ఉద్యోగుల కోసం పలు టవర్లు నిర్మించారు. అలాగే ఎమ్మెల్యేలు .. న్యాయమూర్తుల కోసం కూడా భవనాలు నిర్మించారు. కొన్ని 80 శాతం వరకూ పూర్తయ్యాయి. జగన్ సర్కార్ వచ్చిన తర్వాత వాటిని అలా నిరుపయోగంగా ఉంచారు. కనీసం మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేదు.
గ్రూప్ డీ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలు ఉద్యోగులకు ఇవ్వకుండా.. ఇప్పుడు ప్రైవేటుగా ఎవరికైనా లీజుకు ఇవ్వాలని సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ మేరకు చంద్రబాబు హయాంలో అమరావతికి తీసుకొచ్చిన రెండు ప్రైవేటు యూనివర్శిటీలతో సంప్రదింపులు జరిపారు. వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్ యాజమాన్యం.. ఓ భవనం అద్దెకు తీసుకుని.. విద్యార్థులకు వసతి సౌకర్యం ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. ఏడాదికి రూ. పది కోట్లు వస్తాయన్న లెక్క చెప్పేసరికి జగన్ కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
అమరావతిలో అసలు పనులేమీ జరగలేదని… అన్నీ గ్రాఫిక్సేనని విపరీతంగా ప్రచారం చేశారు. అమరావతిని స్మశానం అన్నారు. ఇప్పుడు ఆ స్మశానంలో స్థలాలను ఎకరాల కొద్దీ అమ్మాలని నిర్ణయించడమే కాకుండా గ్రాఫిక్స్ అని చెప్పిన వాటితోనే ఏడాదికి రూ. పది కోట్ల ఆదాయం కళ్ల జూడాలని డిసైడయ్యారు. అసలు పూర్తిగా నిర్వీర్యం చేసిన అమరావతి నుంచి ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తూంటే.. నిజంగా అభివృద్ధి చేసి ఉంటే.. కాసుల పంట పండి ఉండేది కాదా అని చాలా మందికి వస్తున్న సందేహం.