రాజీనామాల వ్యూహాన్ని జగన్ వదిలించుకున్నారు. విశాఖలో ప్రజా ప్రతినిధుల రాజీనామాలతో సెంటిమెంట్ పెంచాలనుకున్నారు. ముందుగా ధర్మానతో ఆ మాట అనిపించారు. అదే అదనుగా ధర్మశ్రీ లాంటి వాళ్లు రాజీనామా లేఖలతో హడావుడి చేశారు. అవంతి వంటి వాళ్లు మాటలతోనే అయినా మేమూ రెడీ అన్నారు. కానీ మూడు రాజధానుల కోసం ఒక్కరేనా రాజీనామా చేసేది అని టీడీపీ సెటైర్లు వేయడంతో… తాము ఎక్కడ తప్పులో కాలేశామో అర్థమైపోయింది. వెంటనే రాజీనామాలు చేస్తామని చెప్పలేదని స్టేట్ మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎపిసోడ్ ప్రారంభించిన ధర్మానతోనే ముగింపునిచ్చారు.
విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం అవసరమైతే రాజీనామా చేస్తానని ప్రకటించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాకుండా కొంత మంది అడ్డుకుంటున్నారని అందుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించాలని కోరారట. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ధర్మానను వారించారు అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అని.. ఆ దిశగా ప్రయత్నిద్దామని రాజీననామాలు అవసరం లేదని సర్ది చెప్పారంటున్నారు. దీనికి ధర్మాన మరో అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం లేదు కాబట్టి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసిపోతుంది.
ధర్మాన రాజీనామా చేస్తే ఇతర ప్రాంతాల నేతలపై కూడా ఒత్తిడి పెరుగుతుందని వైఎస్ఆర్సీపీ పెద్దలు భావించినట్లుగా తెలుస్తోంది. రాయలసీమ ప్రాంత వాసులు కూడా తమకు న్యాయరాజధాని కాకుండా గతంలో మాదిరిగా అసలైన రాజధానినే కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాజీనామాలు చేస్తే సమస్య మరింత జఠిలం అవుతుంది. రెండు ప్రాంతాల నేతలూ రాజీనామాలు చేస్తే కోస్తా …నేతలు సైలెంట్‌గా ఉండే అవకాశం లేదు. అదే జరిగితే ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని.. ఆగిపోయినట్లుగా తెలుస్తోంది.