వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో చేపట్టిన డిల్లీ యాత్రతో తెదేపా నేతలకు గుబులు పుట్టించగలిగారు కానీ మూడు రోజులు డిల్లీలో మకాం వేసినా ప్రధాని నరేంద్ర మోడి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీల అపాయింట్ మెంట్ దొరకకపోవడం చాలా నిరాశ కలిగించే విషయమే. తెదేపాకి భాజపా మిత్రపక్షంగా ఉన్న కారణంగానే ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదేమోనని జగన్ అనుమానం వ్యక్తం చేయడం విశేషం. ఇదివరకు జగన్ ఎప్పుడు కోరినా ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇచ్చేవారు. ఈసారి కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, ధర్మేన్ ప్రధాన్ మాత్రమే జగన్ కి అపాయింట్మెంట్ ఇచ్చేరు. అందుకు తెదేపా వారిపై చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. 12 సిబీఐ కేసులలో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తో సమావేశం కావడం, మిత్రపక్షమయిన తెదేపాపై ఆయన చెపుతున్న పిర్యాదులను శ్రద్దగా ఆలకించడం దేనికి సంకేతం? అని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు గట్టిగానే ప్రశ్నించి, ముఖ్యమంత్రి తరపున తమ అభ్యంతరాన్ని కేంద్రానికి తెలియజేసారు. బహుశః ఆ కారణంగానే ప్రధాని నరేంద్ర మోడి జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వలేదేమోనని అనుమానించవలసి వస్తోంది.
అయితే వైకాపా నేతలు మాత్రం తమ డిల్లీ పర్యటన విజయవంతం అయ్యిందని చాలా సంబరపడుతున్నారు. తెదేపా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తాము చేసిన పిర్యాదులు చేరవలసిన వారందరికీ సరిగ్గానే చేరాయని, అలాగే తెదేపా నేతలలో గుబులు పుట్టించగలిగామని చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా జగన్ తో కేంద్ర మంత్రులు సమావేశం అవడాన్ని తెదేపా గట్టిగా ఖండించించి కనుక అది తెదేపా-భాజపాల సంబంధాలను ఇంకా దెబ్బ తినడానికి ఇంకా దోహద పడుతుందని వారు బలంగా విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా అది నిజమని నమ్మవచ్చు కూడా. ఎందుకంటే ఇదివరకు తెదేపా చాలాసార్లు కేంద్రంతో కొంచెం ఘర్షణ వైఖరి అవలంభించినా, ఈవిధంగా ఎన్నడూ కేంద్ర మంత్రుల పేర్లు చెప్పి హెచ్చరికలు చేయలేదు. కానీ తెదేపాకి ఇప్పుడు అటువంటి పరిస్థితి జగన్ కల్పించగలిగారంటే, ఒకవిధంగా జగన్ తన ప్రయత్నాలలో కొంతమేర సఫలం అయినట్లే చెప్పవచ్చు.
తెదేపా-భాజపాలు విడిపోవాలని జగన్ కోరుకొంటున్న సంగతి పెద్ద రహస్యమేమీ కాదు. ప్రత్యేక హోదా తదితర హామీల అమలు చేయనందుకు నిరసనగా ఇద్దరు కేంద్ర మంత్రులను రాజీనామాలు చేయామని జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా కోరుతూనే ఉన్నారు. అది వాటి మధ్య విభేదానికి దారి తీస్తుందనే ఆలోచనతోనే జగన్ ఆవిధంగా డిమాండ్ చేస్తున్నారు తప్ప ప్రత్యేక హోదా కోసం కాదని సాక్షాత్ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడే చెప్పారు. రెండేళ్ళుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాని ఆ మిత్రభేదం కార్యం, ఇన్నాళ్ళకు ఈవిధంగా నెరవేరే అవకాశాలు కనబడుతుండటం జగన్మోహన్ రెడ్డికి ఆనందం కలిగించే విషయమే కదా? తెదేపాకు తాత్కాలికంగా ఊరట కలిగించేందుకే ప్రధాని మోడీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చి ఉండకపోవచ్చు. అందుకు జగన్ కొంచెం నిరాశ పొందినప్పటికీ తన యాత్ర విజయవంతం అయ్యిందని సంతోషపడటం సమంజసమే కదా! అయితే విజయవంతమయిన ఈ డిల్లీ యాత్ర తరువాత కూడా అయన తన ఎమ్మెల్యేలను పార్టీ విడిచిపోకుండా ఆపలేరు. తెదేపా ప్రతిష్టని ఇంతగా దెబ్బ తీసినందుకు అది కూడా ఫిరాయింపుల కార్యక్రమం వేగం పెంచవచ్చు. కనుక వైకాపా పరిస్థితి ఇంకా దిగజారవచ్చు. మరి జగన్ అప్పుడు ఏమి చేస్తారో..ఎక్కడికి వెళ్తారో చూడాలి.