వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాస్త జోరు అందుకుంటున్నది. విశాఖలో రైల్వేజోన్ సాధనకోసం పార్టీ నాయకుడు గుడివాడ అమర్నాధ్ సాగిస్తున్న దీక్ష, దానికి లభిస్తున్న ప్రజాస్పందన.. ఆ దీక్ష ద్వారా తెలుగుదేశం సర్కారు ఇరుకున పడిన వైనం ఇవన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. ఆయన చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష ఇప్పటికే మూడో రోజుకు చేరుకుంది. మరో రెండురోజుల్లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు ఆయనను అరెస్టు చేసి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పార్టీలో కొత్తగా వినిపిస్తున్న ఆలోచన ఏంటంటే.. అమర్నాధ్ను అరెస్టు చేస్తే గనుక.. వెంటనే అదే శిబిరంలో వైఎస్ జగన్ దీక్షకు కూర్చుంటారని అనుకుంటున్నారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని విశాఖ రైల్వేజోన్ వైపు ఆకర్షించినట్లు అవుతుందని అనుకుంటున్నారు.
విశాఖ రైల్వేజోన్ అనేది కేవలం విశాఖ ప్రగతికి సంబంధించిన అంశం ఎంతమాత్రమూ కాదని, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయం అని ప్రజల్ని నమ్మించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. రైల్వేజోన్ సాధించడంలో తెలుగుదేశం పార్టీ చేతగానితనాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లడంలో కూడా వారు పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దీక్ష ద్వారా వారికి ఎక్కువ మైలేజీ కూడా దొరుకుతోంది.
పైగా ఈ దీక్ష గురించి ప్రకటించిన రౌండ్ టేబుల్ సమావేశంలోనే.. బొత్స సత్యనారాయణ… అమర్నాధ్ దీక్ష వలన ప్రయోజనం లేకపోతే గనుక.. ఏకంగా వైఎస్ జగన్ దీక్షకు కూర్చుంటారంటూ ఆనాడే ప్రకటించారు. ఇప్పుడు అదే పనిచేయాలని పార్టీ కూడా భావిస్తున్నట్లు సమాచారం. దీక్షకు చాలా స్పందన ఉన్నది గనుక.. అమర్నాధ్ను అరెస్టు చేసే అవకాశం ఉన్న 5వ రోజున పరామర్శ నిమిత్తం జగన్ స్వయంగా విశాఖ వెళ్లాలని, ఆరోజు దీక్షలో ఆయనతో పాటు పాల్గొనాలని, ఆయనను అరెస్టు చేస్తే గనుక.. అదే శిబిరంలో జగన్ దీక్షను కొనసాగించాలని వారు భావిస్తున్నారు.
జగన్ కు దీక్షలు కొత్త కాదు. వాటిని తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేయడమూ కొత్త కాదు. కానీ రైల్వేజోన్ విషయంలో ఈ చంద్రబాబు సర్కారు ప్రజలకు మాయమాటలు చెప్పిన తరువాత.. ఇలాదీక్షల ద్వారా వైకాపా జనం దృష్టిని ఆకర్షించడం వారికి ఇబ్బందికరమే అవుతుంది.