ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రక్షాళనపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. కేబినెట్ భేటీలో సీఎం జగనే ఈ విషయాన్ని చెప్పిటన్లుగా బయటకు వచ్చింది. కొంత మందిని కొనసాగిస్తానని కూడా చెప్పినట్లుగా ప్రచారం జరుగుతున్నా … మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్లు మాత్రం వంద శాతం తొలగిస్తారని.. కొత్త వాళ్లను తీసుకుంటారని చెబుతున్నారు. ఈ అంశంపై మీడియాలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. కానీ సీఎం జగన్ .. ఎప్పుడు కేబినెట్ ప్రక్షాళన చేయాలన్నదానిపై ఇప్పటికీ స్పష్టమై న నిర్ణయానికి రాలేదని వైసీపీలోని అత్యున్నత వర్గాలు చెబుతున్నాయి.
ఏప్రిల్లో ఉగాది కంటే ముందే కొత్త కేబినెట్ తేవాలని జగన్ బలంగా అనుకుంటున్నారు. కానీ వివిధ కారణాలతో జరిగే అవకాశం లేదని.. ప్లీనరీ కంటే ముందు కొత్త కేబినెట్ ను ఏర్పాటు చేస్తారని కొంత మంది చెబుతున్నారు. బహుశా అది జూన్లో ఉండవచ్చని అంటున్నారు. ఆషామాషీగా ఇప్పుడు కేబినెట్ రూపకల్పన చేయడానికి లేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎవరికి పదవి ఇచ్చినా.. మిగతా వారిని బుజ్జగించవచ్చు. కానీ రెండేళ్లు గడువు ముగిసిపోయిన తర్వాత ఇక మంత్రి పదవి చాన్స్ రాదనుకునేవారు.. కఠినమైన నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. అందుకే జగన్ ఆశావహులందరికీ సర్ది చెప్పి.. ఆ తర్వాత లెక్క తేల్చాలనుకుంటున్నారు.
ఏప్రిల్లో కొత్త జిల్లాల ప్రక్రియ ఉంది. అప్పుడు పాలనా పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అలాంటి సమయంలో మంత్రుల్ని మారిస్తే.. ఇంకా గందరగోళం అవుతుందేమోనన్న ఆందోళనలో వైసీపీ వర్గాలు ఉన్నాయి. జగన్ కూడా అదే ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. మొత్తంగా జగన్ అనుకుంటే ఏ క్షణమైనా మంత్రివర్గ విస్తరణ చేస్తారు. కానీ… పరిణామాలను విశ్లేషించుకుంటే.. మాత్రం జూన్ లో చేసే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.