ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఇప్పుడు రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. రణం లేదు.. రాజీ లేదు అనే పాలసీని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కూడారణం బాట పట్టింది. మోడీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. దీనికి కారణం వ్యాక్సిన్ . అరకొరగా వ్యాక్సిన్ … ఆక్సిన్ పంపిణీ చేయడమే కాదు.. ఇక నుంచి కొనుక్కోవాలని కేంద్రం తేల్చేసింది. అది కూడా.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ రేటు… ప్రైవేటు హాస్పిటల్స్‌కు మరో రేటు డిసైడ్ చేసింది. ప్రపంచంలోని దేశాలన్నీ తమ ప్రజలకు ఎంత వేగంగా టీకాలిచ్చి.. అంత వేగంగా కరోనా నుంచి బయటపడేయాలని ప్రయత్నిస్తూంటే… ఇండియాలో మాత్రం… బతకాలనుకునేవాళ్లు కొనుక్కుని టీకాలేసుకోండి.. స్థోమత లేనివాళ్లు మీ చావు మీరు చావండి అన్న పాలసీని అనుసరిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.
కేటీఆర్ ..కేంద్రం తీరుపై నేరుగా విమర్శలు గుప్పించారు. ఇదేనా టీమండియా స్ఫూర్తి అని ప్రశ్నించారు. అంతే కాదు.. పీఎం కేర్స్ నిధులు ఏమయ్యాయని కూడా ఆయన ప్రశ్నించారు. వాటిని పెట్టి ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వలేరా అని నిలదీశారు. కేటీఆర్‌తో పాటు మమతా బెనర్జీ, కేరళ సీఎం సహా… బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ప్రశ్నించారు. కానీ ఏపీ ప్రభుత్వం వైపు నుంచి కానీ.. ఏపీ సీఎం జగన్ వైపు నుంచి ఒక్కటంటే ఒక్క ప్రకటన రాలేదు. కేంద్రం ఉచితంగా ఇవ్వకపోతే.. ఏపీ సర్కార్ .. ప్రజలకు ఉచితంగా ఇవ్వదు. కొనుగోలు చేసుకోవాలి. అప్పుడు విమర్శలు వస్తాయి. ఉచితంగా ఇవ్వాలంటే ప్రభుత్వంపై రూ. రెండు వేల కోట్ల భారం పడుతుంది. అది భరించే స్థితిలో ఏపీ లేదు. అయినప్పటికీ.. సీఎం జగన్ కానీ ప్రభుత్వం కానీ.. వ్యాక్సిన్ విధానంపై నోరు తెరవడం లేదు.
ఇప్పటికే నలభై ఐదేళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్ నడుస్తోంది. కోటి మందికి టీకా వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.. కానీ కేంద్రం నుంచి నాలుగైదు లక్షల టీకాలు కూడారావడం లేదు. వాటిని ఒక్క రోజులో వేసేస్తున్న ప్రభుత్వం సిబ్బంది తర్వాత సైలంటవుతున్నారు. ప్రజలు వ్యాక్సినేషన్ సెంటర్ల ఎదుట పడిగాపులు పడాల్సి వస్తోంది. అదే సమయంలో గుజరాత్‌కు ఉత్తరాది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు.. ఆక్సిజన్లు.. రెమిడిసివిర్ ఇంజెక్షన్లు కేటాయిస్తున్నారు. అయినా ఏపీ సర్కార్‌లో కదలిక లేదు. ప్రజా అవసరాల కోసం కేంద్రాన్ని ఎప్పుడూ ప్రభుత్వం ప్రశ్నించిన పాపానపోవడం లేదు. ఫలితంగా.. కష్టాలు పడుతోంది ప్రజలే. ప్రభుత్వం మాత్రం.. నిమ్మళంగా ఉంటోంది.