ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్టీసీ కోసం తీసుకుంటున్న 350 ఎలక్ట్రిక్ బస్ టెండర్ల వ్యవహారంలో.. చాలా ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఆంధ్రజ్యోతి రాసిన కథనంపైనే.. మీడియాపై .. ఏపీ సర్కార్ కు మంట పుడుతోంది. ఇప్పుడు ఈ బస్సుల టెండర్లపై.. కొత్తగా.. జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు పిలిచిన టెండర్లను జ్యుడీషియల్ కమిషన్ కు పంపాలని ఆదేశించారు. అదేంటి..? అన్ని కాంట్రాక్టులు, టెండర్లను.. ఆ కమిషన్‌కు పంపుతారు కదా.. అని చాలా మందికి డౌట్ రావొచ్చు. కానీ దీన్ని ఇంతకు ముందు పంపదల్చుకోలేదు. జ్యూడిషియల్ కమిషన్ నోటిఫికేషన్ రాక ముందే.. ఈ బస్సుల టెండర్లు పిలిచారట. అందుకే వద్దనుకున్నారట. కానీ ఇప్పుడు జగన్ ఆదేశంతో.. జ్యూడిషియల్ కమిషన్ రివ్యూకు పంపాలనుకుంటున్నారట.
జ్యుడీషియల్ కమిషన్ ముందుకు ఈ టెండర్లను సమీక్షకు పంపించాల్సిందేనని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి పేర్ని నాని చెబుతున్నారు. ఇలా చేస్తే ప్రక్రియ ఆలస్యమవుతుందని, నీతిఆయోగ్ నుంచి ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సబ్సిడీ రావాలంటే నవంబర్ 14వ తేదీలోగా ప్రతిపాదనలు నీతిఆయోగ్ కు వెళ్లాలని తాను చెప్పినా.. సీఎం వినిపించుకోలేదని.. పేర్ని నాని అంటున్నారు. అవసరమైతే మన రాష్ట్రంలో ఉన్న జ్యుడీషియల్ కమిషన్ విధానం గురించి నీతిఆయోగ్ కు వివరించి మరికొంత సమయం తీసుకోవాలని తనకు సూచించారని చెబుతున్నారు. ఈ కారణంగా.. ఎలక్ట్రిక్ బస్ టెండర్లను.. జ్యూడిషియల్ కమిషన్‌కు పంపడం ఖాయమని.. చెబుతున్నారు. అయితే.. పేర్ని నాని.. ఇదంతా ఆఫ్ ది రికార్డ్ మాత్రమే చెబుతున్నారు. రికార్డెడ్ గా కాదు.
పోలవరం ప్రాజెక్టులో.. తక్కువకు పనులు చేసినందుకు.. మేఘా కృష్ణారెడ్డికే చెందిన ఒలెక్ట్రా అనే ఎలక్ట్రిక్ బస్ కంపెనీకి.. ఎక్కువ రేటుకు.. ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు ఇవ్వాలనుకుంటోందన్న ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే ఒలెక్ట్రా.. టెండర్లలో పాల్గొంది. ప్రస్తుతం ఈ టెండర్ ప్రాసెస్‌లో ఉంది. ఇది ఒలెక్ట్రాకే దక్కితే… ఆరోపణలకు బలం చేకూరుతుంది. అయితే.. ఈ టెండర్లలో పెద్ద ఎత్తున ప్రముఖ సంస్థలు కూడా పాల్గొన్నాయి. ఇప్పుడు.. ఈ ప్రక్రియ జ్యూడిషియల్ కమిషన్ వద్దకు వెళ్తే.. ఆరోపణలు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.