కలెక్టర్ “వైట్ కాలర్” జాబ్ కాదని… ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… మాటలతో కాదు.. చేతలతో .. చెబుతున్నారు. కలెక్టర్లందరికీ.. విధుల విషయంలో కొత్త కొత్త పని విధానాలు ఖరారు చేశారు. నెలలో పదిహేను రోజుల పాటు కచ్చితంగా.. క్షేత్ర స్థాయికి వెళ్లాలని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ల కన్నా క్షేత్రస్థాయి పర్యటనలతోనే ప్రజలకు న్యాయం చేయగలమని.. ఆయన అధికారులకు స్పష్టం చేశారు. పథకాల విషయంలో ప్రజలు, లబ్ధిదారులు, తదితర వర్గాల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ చాలా కీలకమని స్పష్టం చేశారు. ఆకస్మిక తనిఖీలు చేయాలని రాత్రి పూట ఆస్పత్రులు, హాస్టల్స్, పల్లెల్లో నిద్ర చేయాలని పేర్కొన్నారు. దీని వల్ల క్షేత్రస్థాయి పరిస్థితులు మెరుగు పడతాయని జగన్ భావిస్తున్నారు.
పరిపాలనలో తనకు కళ్లూ, చెవులు కలెక్టర్లేనని మొదటి నుంచి చెబుతున్న జగన్.. వారిని ప్రజల్లోకి పంపేందుకు గట్టి కార్యాచరణ ప్రారంభించారు. ఇప్పటికి.. ఆరు నెలల కాలంలో.. కలెక్టర్లు పెద్దగా కుదురుకోలేదు. ప్రభుత్వం కొత్త విధానాలు తీసుకు రావడంతో.. వాటికి అనుగుణంగా.. యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవడంతో.. కలెక్టర్లు తీరిక లేకుండా గడిపారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయాల వ్యవహారం దగ్గర్నుంచి.. ప్రతీ విషయం కలెక్టర్లే చూడాల్సి వస్తోంది. ఈ క్రమంలో పని ఒత్తిడితో పలువురు కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లింది తక్కువ.
గత ముఖ్యమమంత్రి చంద్రబాబునాయుడు.. వీడియో కాన్ఫరెన్స్‌లకు ప్రాధాన్యం ఇచ్చేవారు. గంటల తరబడి మీటింగులు జరిగేవి. గణాంకాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. క్షేత్ర స్థాయిలో ప్రజల ఫీడ్ బ్యాక్‌పై పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని గమనించారేమో కానీ… వీడియో కాన్ఫరెన్స్‌ల కన్నా.. ఎక్కువగా… కలెక్టర్ల క్షేత్రస్థాయి పర్యటనల కోసమే.. సీఎం ఒత్తిడి చేస్తున్నారు.