”వద్దని నేను ముందే చెప్పాను.. కానీ మీరు ఏదో కార్యం చక్కబెట్టేస్తాం అంటూ పూనుకుని బయల్దేరి వెళ్లారు. ఇప్పుడు ఏమైంది పరువుపోయింది తప్ప.. పని జరగలేదు” అంటూ వైఎస్ జగన్మోహనరెడ్డి చిర్రుబుర్రులాడుతున్నారుట. వైఎస్సార్ కాంగ్రెస్‌నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించేస్తున్న నాయకుల మీద పార్టీ అధినేత తొలినుంచి ఉపేక్ష ధోరణినే అనుసరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వారి గురించి మాట్లాడడమే అనవసరం అంటూ ఛీత్కరించుకుంటూ జగన్ వారిని మరింత దూరం చేసుకున్నారు. దమ్ముంటే రాజీనామాలు చేసి గెలవాలనే డిమాండ్ ఒక్కటీ తప్ప.. ఇతరత్రా వారి గురించి పట్టించుకుంటున్నది లేదు.
ఇలాంటి నేపథ్యంలో బొబ్బిలి రాజులు పార్టీ మారుతోంటే.. వారిని బుజ్జగించడానికి విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి మరికొందరు కీలక నేతలు వెళ్లడం జరిగింది. వారు తన బొబ్బిలి కోటకు వస్తున్నారని తెలిసినప్పటికీ, వారికి అందుబాటులో లేకుండా సుజయకృష్ణ మొహం చాటేసి బయటకు వెళ్లిపోవడం, వారు ఫోనులో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాకపోవడం, వారు ఇంటి వద్ద కాసేపు నిరీక్షించి ఉత్తచేతుల్తో తిరిగి వచ్చేయడం జరిగింది. ఒక రకంగా ఇది వైకాపాకు పెద్ద అవమానం కిందే లెక్క.
ఈ అవమానాన్ని జగన్ సహించలేకపోతున్నారట. బుజ్జగింపులు వద్దని నేను ముందే చెప్పాను. కానీ మీరు విన్లేదు. ఇప్పుడు పరువునష్టం తెచ్చిపెట్టారు. అంటూ దూతలుగా వెళ్లిన వారిమీద కస్సుబుస్సు మంటున్నారట. వెళ్లిపోతున్నట్లు ప్రకటనలు చేసిన వారిని బుజ్జగించడానికి వెళ్లి పరువు పోగొట్టుకునే బదులుగా, ఇంకా పుకార్ల దశలో ఉన్న, వెళ్లాలని అనుకుంటున్న వారిని గుర్తించి వారు పార్టీలోనే ఉండేలా కాపాడుకోవాలని ఆయన పార్టీ వ్యూహకర్తలకు నిర్దేశిస్తున్నట్లుగా తెలుస్తున్నది. మరి రాజ్యసభ ఎంపీ ఎన్నికలు వచ్చేలోగా తమ బలం తగ్గిపోకుండా ఎలాంటి వ్యూహాలు చేస్తారో చూడాలి.