తెలంగాణలో టీఆర్ఎస్ స్వీప్ చేసినట్లుగా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం వైసీపీ ఖాతాలో పడాలని… జగన్మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. ఇందు కోసం.. సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశారు. రాష్ట్రాన్ని ఐదు భాగాలుగా మార్చి.. ఐదుగురు పార్టీ కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈ ఐదుగురు… వైసీపీలో పేరున్న పెద్ద రెడ్లే. అందులో మొదటి వ్యక్తి విజయసాయిరెడ్డి.. రెండో వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి..మూడో వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి, నాలుగో వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి.. ఐదో వ్యక్తి అయోధ్య రామిరెడ్డి. వీరికి ఒక్కొక్కరికి.. రెండు, మూడు జిల్లాలచొప్పున జగన్ పంచి పెట్టారు. అక్కడ పార్టీ కోసం అన్ని అవసరాలు చూసుకోవాలని ఆదేశించారు.
విజయసాయరెడ్డి మొదటి నుంచి ఉత్తరాంధ్రపైనే గురి పెట్టారు. ఆయన విశాఖనే కార్యక్షేత్రం చేసుకున్నారు కాబట్టి.. ఆయనకు ఉత్తరాంధ్ర జిల్లాల గెలుపు బాధ్యతలు అప్పగించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉభయ గోదావరి జిల్లాలు, సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిత్తూరు, అనంతపురం జిల్లాలు, రాంకీ గ్రూప్ అయోధ్యరామిరెడ్డికి గుంటూరు, కృష్ణా జిల్లాలు అప్పగించారు. పార్టీలో ఇతర సామాజికవర్గాలకు చెందిన నేతలు అంతంతమాత్రంగానే ఉన్నారు. ఉన్నవారంతా.. డమ్మీ పాత్రలే పోషిస్తున్నారు. ఎవరికీ నిర్ణయాధికారం ఉండటం లేదు. ఐదుగురికి డిప్యూటీ సీఎం పోస్టులిచ్చినా.. రెడ్డి సలహాదారులే సూపర్ పవర్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా.. ఎన్నికల నిర్వహణ కూడా ఈ రెడ్ల చేతుల్లోకే వెళ్లింది.
ఈ ఐదుగురు తెర వెనుక ఎన్నికల నిర్వహణలో రాటుదేలిపోయిన వారేనన్న ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. పార్టీ నేతల్ని..డబ్బుతో కొనడం దగ్గర్నుంచి పోలింగ్ ముందు రోజు వ్యవహారాను అదే మనీతో అనుకూలంగా మార్చుకోవడం వరకూ… ఎలాంటి పరిస్థితిని అయినా వీరు సమర్థంగా ఎదుర్కొంటారని.. భావిస్తున్నారు. అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయవద్దని.. ఆదేశించారని వైసీపీ నేతలు చెబుతున్నారు.