పులివెందుల వైసీపీ నేతలకు జగన్ రెడ్డి డబ్బులు పంచుతున్నారు. స్థాయిని బట్టి రూ. యాభై వేల నుంచి ఇరవై లక్షల వరకూ పంచుతున్నారు. స్వయంగా అవినాష్ రెడ్డి లెక్కలు రాసుకుంటూ .. పులివెందులలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచే ఈ డబ్బులు పంచుతూండటం ఆసక్తికరంగా మారింది. ఎన్ని కోట్లను పంచుతారనే సంగతిని పక్కన పెడితే ఎప్పుడూ లేని విధంగా సొంత పార్టీ క్యాడర్ కు డబ్బులు పంచడం ఏమిటన్న చర్చ మాత్రం పులివెందులలో నడుస్తోంది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీ క్యాడర్ పరిస్థితి ఘోరంగా మారింది. దానికి పులివెందుల కూడా మినహాయింపు కాదు. ఆర్థికంగా చితికిపోయారు. అందుకే ఎన్నికలకు ముందు అందరికీ ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కార్యకర్తల దగ్గర ఓ లేఖ తీసుకుని యాభై వేలు ఇస్తున్నారు.. ఎంపీటీసీల స్థాయి నుంచి అన్ని స్థాయిలో ప్రజాప్రతినిధులకు లక్షలు పంచుతున్నారు. అయితే జగన్ రెడ్డి పరిస్థితి ఇలా ఉంటే.. మరి మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటన్నది చాలా మందికి అర్థం కావడంలేదు.
రాష్ట్రం మొత్తం వైసీపీ క్యాడర్ పూర్తిగా దెబ్బతినిపోయింది. అందుకే ఎవరూ కనీసం గ్రామాల్లో వైఎస్ విగ్రహాల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కల్ని కూడా తొలగించడం లేదు. వర్థంతులు… జయంతులు కూడా పట్టించుకోవడం లేదు. పార్టీ కోసం రూపాయి ఖర్చు పెట్టినా దండగేనని అనుకుంటున్నారు. ఈ పరిస్థితిని గమనించి క్యాడర్ కు డబ్బులు పులివెందులలో పంచుతున్నారు.. మరి నియోజకవర్గాల్లో క్యాడర్ కు ఎప్పుడు .. ఎవరు డబ్బులు పంచుతారు ?