అసెంబ్లీ సమావేశాలకు హాజరు అవుతారా..? లేదా అనే సస్పెన్స్ కు చెక్ పెడుతూ అసెంబ్లీకి జగన్ హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వచ్చిన జగన్ రెడ్డి సభలో తలెత్తుకునేందుకు కూడా ఇష్టపడకపోవడం గమనార్హం.
అసెంబ్లీ సెక్రటరీ ఆహ్వానం మేరకు ప్రమాణస్వీకారం చేసేందుకు వెళ్తుండగా సభ్యులకు నమస్కరించుకుంటూ వెళ్ళిన జగన్ ఏదో కోల్పోయినట్లుగా కనిపించారు. పరాజయ భారమో, టెన్షన్ లోనో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తూ తన పేరును తనే సరిగా చెప్పుకోలేక తడబడ్డారు. వైఎస్ జగన్ మోహన్ అను నేను అంటూ మొదట చదివిన జగన్ ఆ తరువాత సవరించుకుని జగన్ మోహన్ రెడ్డి అను నేను అని చదివారు. ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత ప్రోటెం స్పీకర్ గా వ్యవహరించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి వద్దకు వెళ్లి నమస్కరించి మాట్లాడిన జగన్.. బుచ్చయ్య కళ్ళలోకి కూడా సరిగా చూడలేక తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
ఒకప్పుడు అధికారగర్వంతో విర్రవీగిన జగన్…అధికారం కోల్పోవడం అవమానంగా ఫీల్ అవుతున్నారు. కేవలం 11మంది సభ్యులను వెంటేసుకొని సభకు వెళ్లి అధికార పక్షాన్ని నిలదీయడం అంతా ఈజీ కాదు. అందుకే సభకు వెళ్లే విషయంపై చివరి వరకు ఊగిసలాటలోనే ఉండిపోయారు. పైగా.. గతంలో తాము 150మంది ఉన్నామని గొప్పగా చెప్పుకున్నా జగన్ ఇప్పుడు కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నారు. ఇవన్నీ గుర్తుకు వచ్చాయో మరేమిటో కానీ, సభలో జగన్ తలెత్తుకోనెందుకు కూడా పెద్దగా ఇష్టపడలేదు.