వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు వలసలు వెళుతూ ఉండడానికి అచ్చంగా.. తెలుగుదేశం పార్టీ ప్రయోగిస్తున్న ఆకర్ష మంత్రం ఒక్కటే కారణమా? మరో ఇబ్బంది ఏమీ ఇక్కడ కనిపించడం లేదా? అంటే పార్టీ నాయకులు మాత్రం ఒప్పుకోవడం లేదు. కేవలం తెదేపా ఆకర్ష మంత్రం మాత్రమే కాదు.. వైకాపా పార్టీలో అంతర్గతంగా ఉన్న లోపాలు, దిద్దుకోలేని పరిపాలన వైఫల్యాలు కూడా చాలా ఉన్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు పార్టీ వలసల గురించి ముమ్మరంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీ నాయకుల మాటల్లో వ్యక్తం అవుతున్న కొన్ని అభిప్రాయాలు ఇలాంటి అనుమానం కలిగిస్తున్నాయి.
పార్టీలో అంతర్గతంగా ఉన్న గొడవలు, నాయకుల మధ్య విభేదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం, పార్టీ నాయకులు అందరినీ ఒక్కతాటిమీద నడపడం అనేది జగన్ ఎన్నడూ పట్టించుకోలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు అదే పరిస్థితులు మరింతగా విషమించి, పార్టీనే నష్టపరిచే స్థితికి చేరుకున్నాయి. ఉదాహరణకు ప్రకాశం జిల్లా విషయానికి వస్తే.. అక్కడ మామా అల్లుళ్ల మధ్య ఉన్న విభేదాలనే జగన్ పట్టించుకోలేదని సమాచారం. ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడు, జగన్కు స్వయంగా మామ అయ్యేంత దగ్గరి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ వీడిపోతాడని పుకార్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన బాలినేని, తాను పార్టీని వీడడం లేదని అంటూనే.. స్థానికంగా తన మామ వైవీసుబ్బారెడ్డితో ఉన్న విభేదాలను కూడా ప్రస్తావించారు.
వైవీ సుబ్బారెడ్డితో విభేదాలు నిజమే అని, జగన్ వాటిని పరిష్కరిస్తాడని నమ్ముతున్నామని బాలినేని అనడం చాలా ప్రాధాన్యం గల మాట. ఎన్నికలు పూర్తయి రెండేళ్లు అయినా.. ఇప్పటిదాకా ప్రకాశం జిల్లాలో మామ వైవీసుబ్బారెడ్డి, అల్లుడు బాలినేని మధ్య తగాదాలను పరిష్కరించడం గురించే వారి దగ్గరి బంధువు జగన్ పట్టించుకోలేదంటే.. విభజించి పాలించే సూత్రం మీద ఆయనకు నమ్మకం ఉన్నదేమో అనే అనుమానం కలుగుతుంది. ఇతర జిల్లాల్లో కూడా ఇలా లోకల్ నేతల మధ్య ఉన్న తగాదాలను పరిష్కరించడంపై జగన్ అలక్ష్యం చూపడం వలన ఒక వర్గం తెదేపా బాట పడుతున్నదనే అభిప్రాయాలు వస్తున్నాయి. మరి జగన్ తన మామ బాలినేని మాటల్లోని పరమార్థాన్ని గ్రహించి తన వైఖరిని దిద్దుకుంటారోలేదో?